సిద్దిపేట, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం.తాము ఎవరికి చెప్పుకోవాలో తెల్వని గతి పట్టింది.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలే..ఆటో ఆయనకు డబ్బులిస్తే మందు బస్తాలు తీసుకువచ్చి పంట చేను కాడ ఏసేవాళ్లు..ఇవ్వాళ కాంగ్రెస్ పాలనలో ఒక్క యూరియా బస్తా కోసం పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు..ఎండ లేదు…రాత్రి లేదు…పగలు లేదు క్యూలో నిలబడుతున్నాం.
అక్కడే సద్ది కట్టుకొని తింటున్నాం.రాత్రి పూట అక్కడే నిద్రపోతున్నాం. క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు, అట్ట డబ్బాలు, ఖాళీ సీసాలు, రాళ్లు పెడుతున్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. . క్యూలో తమ వరకు బస్తా వస్తదా…? రాదా..?తెలియదు.ఇప్పటికే అదును దాటింది.. ఇక మందు చల్లినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు యూరియా మూడు బస్తాలు పడుతుంది. నాటు వేసిన 15 రోజులకు ఒక బస్తా, కలుపు తీశాక మరో బస్తా, పొట్ట దశలో ఒక బస్తా చల్లుతారు. ఇప్పటి వరకు పొట్ట దశకు వచ్చిన వరికి యూరియా చల్లని వారు ఉన్నారని రైతులు మండిపడున్నారు.
తమ కమీషన్ల కోసం వ్యవసాయశాఖ అధికారులు ఫర్టిలైజర్ డీలర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణనలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేంద్రంగా బ్లాక్‌లో యూరియా దందా కొనసాగుతోంది. ఒక్కో బస్తాకు రూ. 400 తీసుకుంటున్నారు. ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలోనే కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలకు రైతుల బలి అవుతున్నారు. రేవంత్‌రెడ్డి చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదని రైతులు విమర్శిస్తున్నారు.ఇది ఉమ్మడి జిల్లాలోని రైతుల పరిస్థితి.
యూరియాపై పొంతన లేని లెక్కలు
యూరియా విషయంలో అధికారుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి.గత ఆగస్టులో అధికారులు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే సిద్దిపేట జిల్లాలో 11,750 టన్నుల యూరియా అవసరం ఉండగా 5,345 టన్నులు వచ్చినట్లు చెబుతున్నారు. 6,405 టన్నులు రాలేదు.మెదక్ జిల్లాలో 6,600 టన్నుల యూరియా అవసరం కాగా 4,100 టన్నులు వచ్చింది. ఇక్కడ ఇంకా 2,500 టన్నుల యూరియా రాలేదు.సంగారెడ్డి జిల్లాలో 6,616 టన్నుల యూరియా అవసరం కాగా 4,675 టన్నుల యూరియా వచ్చింది. ఇంగా 1,541 టన్నుల యూరియా రాలేదు.
మొత్తం ఉమ్మడి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 24,966 టన్నుల యూరియాకు గాను 14,120 టన్నులు మాత్రమే వచ్చింది.10,466 టన్నుల యూరియా రాలేదు. సగం కూడా రాలేదు.దీంతో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు.కలుపు, పొట్ట దశలోనే వరికి యూరియా చల్లితే పంట దిగుబడి బాగా వస్తుంది. పత్తి పంట, మొక్కజొన్న పంటలకు అవసరం. అదును దాటితే యూరియా వేసినా ప్రయోజనం ఉండదు.
క్షేత్రస్థాయిలో యూరియా కష్టాలు ఉంటే అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం లెక్కల్లో భారీగా తేడాలు చూపుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కొంత మంది వ్యవసాయాధికారులు ఇష్టానుసారంగా టోకెన్లు ఇస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి అడిగినంత రాసిస్తున్నారు.ఏం తెలియని రైతులు క్యూలో నిలబడడానికే సరిపోతుంది. ఇటు యూరియా దొరకక..అటు సాగు పనులు చేసుకోకుండా రెంటికి చెడ్డ రేవడిలా రైతుల పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. నిత్యం యూరియా కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్నాయి. వచ్చేది తక్కువ …డిమాండ్ ఎక్కువగా ఉంది. రైతులు సాగు చేసిన పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిత్యం రాత్రి, పగలు అనే తేడా లేకుం డా రైతులు ఫర్టిలైజర్ షాపులు, సహకార సంఘాలు, రైతు ఆగ్రోస్ కేంద్రాల ఎదుట క్యూలు కనిపిస్తున్నాయి.
నెల రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నది. యూరియా అందక పంట చేతికి రాకుండా పోతుందని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే యూరియా సకాలంలో అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదని రైతులు చెబుతున్నారు.