జహీరాబాద్, ఆగస్టు 21: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాం తంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో స్మార్ట్‌సిటీ, నిమ్జ్ ప్రాజెక్టులతో పారిశ్రామికవాడ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. జహీరాబాద్ పట్టణ ప్రాంతంలో వ్యవసాయ భూములను నివాస, వాణిజ్య స్థలాలుగా మార్చేందుకు అవసరమైన నాలా కన్వర్షన్ అనుమతులు తీసుకోకుండానే వందలాది ఎకరాల్లో అక్రమంగా వెంచర్లు చేస్తున్నారు.
నివాస స్థలాలను కొనుగోలు చేసే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని నల్లరేగడి భూముల్లో ఇండ్ల నిర్మాణాలకు ఏమాత్రం అనువుగా లేకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు చేసి విక్రయిస్తున్నారు. ప్లాట్లను ఆన్లైన్లో విక్రయాలకు పెట్టడంతో కొందరూ వెంచర్లో ప్లాట్ సైట్ చూడకుండానే కొనుగోలు చేస్త్తున్నారు. ఆ తర్వాత వెంచర్లను సందర్శించి అసలు విష యం తెలుసుకుని కొనుగోలుదారులు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన అల్లీపూర్, పస్తాపూర్, చిన్నహైదరాబాద్, రంజోల్, హోతి(కే) గ్రామాల్లో గతంలో గ్రామ పంచాయతీలో నామమాత్రపు అనుమతులు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి విక్రయంచారు.
జహీరాబాద్ పట్టణం పరిధిలోని వందకు పైగానే వెంచర్లు ఉన్నప్పటికీ సగానికి పైగానే అనుమతులు లేకుండా ప్లాట్ల్లను విక్రయిస్తున్నారు. వెంచర్ల పరిధిలో ఫ్రభుత్వ స్థలాలు, నాలాలు, కాల్వలు ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ సంబంధిత మున్సిపల్, మండల అధికారులు పట్టించుకోవడం లేద నే ఆరోపణాలున్నాయి. వెంచర్ల నుంచి వెళ్లే వర ద కాల్వలను సైతం దారి మళ్లిస్తున్నా నీటి పారుదలశాఖ అధికారులు పట్టించుకోకుండా నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్కుల స్థలాలను వదలకుం డా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు.
జహీరాబాద్ పట్టణంలో భారీ వర్షాలు వస్తే ఆదర్శ్‌నగర్-2, వసంత్‌నగర్, ఇంద్రాపస్తానా, గాయత్రీనగర్, డ్రీమ్ ఇండియా, గడి హరిజనవాడ తదితర ప్రాంతాల్లోని వెంచర్లలోని ఇండ్లు నీట మునుగుతున్నాయి. ప్రస్తుతం అల్గోల్ బైపాస్ పరిధిలోని కొత్తగా వెలిసిన వెంచర్లలో వరద నిలుస్తుంది. ఇలా ఇండ్ల నిర్మాణాలకు అనువుగా లేని నల్లరేగడి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఎర్రమట్టిని పోసి కొనుగోలుదారులను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.
చాలాచోట్ల నింబంధల ప్రకారం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారమని తెలిసికూడా వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల డీడీసీటీకి దరఖాస్తు చేశామని, లేనిది ఉన్నట్లు తప్పుడు సమాచారంతో ప్లాట్లను అంటగడుతున్నారు. కేవలం నాలా అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేస్తూ మోసపోతుండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభాలు పొందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకుని అనుమతి లేకుండా వెంచర్లలో క్రయ విక్రయాలు నిలిపివేసి అమాయకులు నష్టపోకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.