గజ్వేల్, ఫిబ్రవరి 7: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెం దిన ఘటన రాజీవ్ రహదారి సమీపంలో ప్రజ్ఞాఫూర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకా రం.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పోరాట్పల్లికి చెందిన పెయింటర్ మెరుగు లింగయ్య(52), అదే గ్రామానికి చెందిన ఎన్టీపీసీ ఉద్యోగి మిస్టే బినేశ్(29), లింగయ్య తమ్ముడు మహేశ్ కారు కిరాయి తీసుకొని హైదరాబాద్కు గురువారం అర్ధరాత్రి బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు రాజీవ్ రహదారి సమీపంలోని ప్రజ్ఞాఫూర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ఉన్న లింగయ్య, బినేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. అందులో నుంచి మృతదేహాలను కట్టర్ సాయంతో వెలికితీశారు. మహేశ్, డ్రైవర్ ప్రణయ్సాయికి తీవ్ర గాయాలు కావడంతో వారిని పోలీసులు చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.