గుమ్మడిదల, డిసెంబర్ 2: స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. ఒకే పార్టీ మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంతో గ్రామపంచాయతీల్లో రాజకీయంగా వేడెక్కింది. అటు అధికార, ఇటు విపక్ష పార్టీ నాయకుల అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో తమ పార్టీకి మద్దతు తెలిపే నాయకుడిని గెలిపించుకుంటే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో సర్పంచులు కీకల పాత్ర పోషిస్తారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీకి చెందిన మద్దతుదారులను గెలిపించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరేసి అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరు చెబితే వింటారో వారితో చర్చలు కొనసాగిస్తున్నారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీకి చెందిన ఇన్చార్జిలు రంగంలో దిగి సదరు నాయకులను బుజ్జగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని 8 గ్రామాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికల పోరులో స్పష్టంగా కనిపిస్తున్నది. గుమ్మిడిదల మండలంలోని ఎనిమిది గ్రామాల్లో అనంతారంలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఇద్దరు చొప్పున సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. నాగిరెడ్డిగూడెంలో ఇద్దరు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. వీరిని బుజ్జగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలు స్వయంగా రంగంలో దిగి ఏకాభిప్రాయం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇద్దరేసి సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఇందులో కొత్తపల్లి, నల్లవల్లి, వీరారెడ్డిపల్లి, కానుకుంట గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తరపున ఒకరు చొప్పున, ఎన్ఎంఆర్ యువసేన, పార్లమెంట్ ఇన్చార్జి తరపున ఒకరు చొప్పున నామినేషన్లు వేశారు. ఒకరు కాంగ్రెస్, మరొకరు అదే పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి మద్దతుదారులు రంగంలో ఉండడంతో వారిద్దరిలో ఎవరిని ఉపసంహరించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వారు ఇరునాయకుల మద్దతుదారులు పోటీలో ఉంటే గెలుపు కష్టమని నాయకులు బుజ్జగిస్తున్నారు. ఇక ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండడంతో బుజ్జగింపులు, ఏకాభిప్రాయాలకోసం పాట్లు పడుతున్నారు.
ఏమిజరగుతుందో బుధవారం మధ్యాహ్నం వరకు తేలిపోనున్నది. కాగా, పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డికి చెందిన మద్దతుదారులు పోటీలో కనిపించకపోవడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కాటా శ్రీనివాస్‌గౌడ్, పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధుముదిరాజ్‌కు చెందిన మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల పోరులో ఉన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేయలేరు. బీఆర్ఎస్ నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ సారధ్యంలో ఇన్చార్జిలను నియమించారు. కాంగ్రెస్ తరపున మండల పార్టీ నాయకులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు లేకపోవడంతో ఎవరి వైపున ఉంటారనేది వేచి చూడాల్సిందే.