మెదక్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఈనెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కోసం బయోమెట్రిక్‌లో వేలిముద్రలు తీసుకుంటామని, అభ్యర్థులు గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. ఎస్పీ బాలస్వామి ఆదేశానుసారం గురువారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు, గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష బయోమెట్రిక్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..పరీక్షకు సంబంధించిన నిబంధనలు హాల్‌టికెట్‌లో పొందుపర్చారని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్‌లోని నిబంధనలు చదువుకోవాలన్నారు. పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి లేదని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహందీ వంటివి పెట్టుకోరాదని సూచించారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని అభ్యర్థులు గుర్తించాలన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రం చుట్టూ 360 డిగ్రీల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని, మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు, చీప్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఈ రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కోఆర్డినేటర్, మెదక్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డా.హుస్సేన్, నోడల్ ఆఫీసర్, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, (PBO) పోలీస్ బయోమెట్రిక్ ఆఫీసర్ మధుసూదన్ గౌడ్, డీసీఆర్బీ సీఐ రవీందర్, బయోమెట్రిక్ సాంకేతిక నిపుణులు అనిల్‌కుమార్, మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వారి దృష్టికి తీసుకొచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. హుస్సేన్, డీసీఆర్బీ సీఐ రవీందర్, ఎస్బీసీఐ సందీప్‌రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ/సిద్దిపేట అర్బన్, జూన్ 6: ఈనెల 9న జరుగనున్న గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పరీక్ష నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ స్ట్రాంగ్‌రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలకు, పరీక్షా కేంద్రాల నుంచి జవాబు పత్రాలను రిసెప్షన్ సెంటర్‌కు తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. స్ట్రాంగ్‌రూం నుంచి పోలీస్ బందోబస్తుతో తీసుకెళ్లి పరీక్షా కేంద్రాల్లోని లైజనింగ్ అధికారులకు అందజేయాలని సూచించారు.