హుస్నాబాద్, జూన్ 24: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డుతో పాటు అంబేద్కర్, మల్లెచెట్టు చౌరస్తాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు, పాదచారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్డులోని దుకాణాల ఎదుట ఇష్టారాజ్యంగా నడిరోడ్డుపై వాహనాలు గంటల తరబడి ఆపుతున్నారు. అయినా కనీసం పట్టించుకునే వారు లేరు. దీంతో జాతీయ రహదారి అయిన మెయిన్‌రోడ్డు నుంచి వెళ్లే భారీ వాహన డ్రైవర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి వెళ్లేందుకు దారిలేక రోడ్డుపైనే భారీ వాహనాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఉంటున్నది.
హుస్నాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అధికారులు, సిబ్బందిని నియమించారు. అయినా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం విశేషం. ప్రధాన కూడళ్లలో తాత్కాలిక డివైడర్లు ఏర్పాటు చేసిప్పటికీ, రోడ్లపైనే వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌తో సమస్యలు ఎదురు కావడంతో పాటు తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు సైతం నడిరోడ్డు పైనే నిలుపుతున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో పలుసార్లు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక క్రమ పద్ధతిలో వాహనాలు వెళ్లేలా చూడాల్సిన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. డ్యూటీ చేశామా… వెళ్లామా… చందంగా మారింది తప్ప, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం లేదని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. దుకాణాదారులకు నోటీసులు జారీ చేసి వాహనాలు నిలిపితే జరిమానా విధిస్తామనే నిబంధనలు పెడితే తప్ప రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మెయిన్‌రోడ్డుతో పాటు ప్రధాన కూడళ్లల్లో రోడ్లపై వాహనాలు నిలుపకుండా, కూడళ్లలో క్రమ పద్ధతి వాహనాలు దాటేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.