సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 15: రాష్ట్రంలో 20శాతం మంది విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ విద్య అందుతున్నదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని శుక్రవారం సంగారెడ్డిలోని ఉపాధ్యాయ భవన్లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అశోక్‌కుమార్ ప్రభుత్వం ద్వారా విద్యను అభ్యసించే పరిస్థితులు 20శాతం మందికే ఉన్నదని, 80శాతం మంది విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్య కరువైందన్నారు. బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి సమాన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు.
బడ్జెట్లో విద్యకు 30శాతం కేటాయించాలని కొఠారి కమిషన్ సూచించినప్పటికీ కేవలం 7శాతం నిధులు మాత్రమే కేటాయించడం విద్యపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటుహక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్వే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రాంచందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యయ, విద్యారంగ అభివృద్ధికి పాటుపడే అశోక్‌కుమార్‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు సంజీవయ్య, లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్, రాజారెడ్డి, నాగేశ్వరరావు, సునీతాఖన్నా, ఉభాష్ బాబు, భాస్కర్ పాల్గొన్నారు.