పటాన్చెరు రూరల్, ఆగస్టు 8: భారత్‌లో తోషిబా మరిన్ని పెట్టుబడులు పెడుతూ స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారీ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని తోషిబా (టీటీడీఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫరుటా అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో తోషిబా పరిశ్రమలో రూ. 562 కోట్లతో నిర్మించిన కొత్త యూనిట్లకు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ డెవలప్మెంట్ మంత్రి క్యోకో హొకుగోతో కలసి మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫరూటా భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.
రూ. 177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణకు భూమిపూజ చేశారు.రూ. 65కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యూఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, రూ. 105కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫరుటా మాట్లాడుతూ.. భారత్‌లో ట్రాన్స్ఫార్మర్లను తయారుచేసి 50కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కంపెనీలు, ఇతర తయారీదారుల కోసం పటిష్టమైన సామాజిక సదుపాయాల కోసం తోడ్పడడం లక్ష్యంగా పెట్టుకుని ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తోషిబా విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమ ద్వారా 400మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
తెలంగాణను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జి పాలసీ-2025 తెచ్చినట్లు చెప్పా రు. 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20 వేల మెగావాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూ పొందించినట్లు తెలిపారు. మంత్రి వివేక్ మాట్లాడు తూ భారీగా పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాలను కల్పిస్తున్న తోషిబా యజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ మంత్రి క్యోకో హొకుగో, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హరిషి కనేట, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు లాహిరి, రామకృష్ణ, రాజ, పటాన్చెరు తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, ఎంపీవో హరిశంకర్‌గౌడ్, కార్యదర్శులు రాజ్‌కుమార్, సుభాష్, నాయకులు పాండు, మాజీ సర్పంచ్‌లు వెంకన్న, సుధీర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పాల్గొన్నారు.