బీఆర్ఎస్ శాసనసభా ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మొదటి జాబితాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. దమ్మున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తొమ్మిది స్థానాలతోపాటు, హుస్నాబాద్, మానకొండూరు శాసనసభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మెదక్ జిల్లా నర్సాపూర్, సిద్దిపేట జిల్లాలో విస్తరించి ఉన్న జనగామ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి ప్రస్తుత మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఆయన అసెంబ్లీకి తొలిసారి పోటీ చేస్తున్నారు. జనంలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో మమేకమవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ అవకాశం ఇచ్చారు.
– సిద్దిపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్‌లకే అవకాశం కల్పించిన దమ్మున్న నేత సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముం దుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల్లో వణుకు పుట్టించారు. త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శాసనసభా స్థానం నుంచి సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ఏడోసారి బరిలోదిగనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తొమ్మిది స్థానాలతోపాటు, హుస్నాబాద్, మానకొండూరు శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. సిద్దిపేట జిల్లాలో విస్తరించి ఉన్న జనగామ స్థానాన్ని సైతం పెండింగ్‌లో ఉంచారు. అన్నిచోట్ల సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు.
దుబ్బాక నియోజకవర్గం నుంచి ప్రస్తుత మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఆయన అసెంబ్లీకి తొలిసారి పోటీ చేస్తున్నారు. మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. నారాయణఖేడ్ నుంచి మహారెడ్డి భూపాల్‌రెడ్డి, అందోల్(ఎస్సీ) చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ (ఎస్సీ)కోనింటి మాణిక్‌రావు, పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి ,హుస్నాబాద్ నుంచి వొడితెల సతీశ్‌కుమార్, మానకొండూరు (ఎస్సీ) నుంచి ఏర్పుల బాలకిషన్ (రసమయి)కి అవకాశం కల్పించారు. సంగారెడ్డి స్థానం నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పలుమార్లు సర్వేలు నిర్వహించిన అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. జనంలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధిలో మమేకమవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ అవకాశం కల్పించడంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో మిన్నంటిన సంబురాలు
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. బైక్‌ర్యాలీలు తీశారు. సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందే లా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కృషిచేశారు. భారీగా నిధులు వెచ్చించి నియోజకవర్గాల రూపురేఖలను మార్చారు.సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. ఉమ్మడి జిల్లాలో రహదారుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ తాగునీరు, తదితర పనులు చేపట్టారు. స్థానికంగా అందుబాటులో ఉండడం, మంచి పనితీరు కనిపించడం, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేయడంతోనే సీఎం కేసీఆర్ సిట్టింగులు అందరికీ టికెట్లు ఇచ్చారు.
ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట..
ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఎన్నికలు ఏవైనా ఇక్కడ విజయం బీఆర్ఎస్దే అని చెప్పాలి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లా అభివృద్ధిలో ముందున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. 2018 ఎనికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 10 అసెంబ్లీ స్థానాలకు 9 గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నుంచి కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 58,290 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్‌రావు టీజేఎస్ పార్టీ అభ్యర్థిపై 1,18,699 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మెదక్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై 47,983 ఓట్లమెజార్టీ, నారాయణఖేడ్ నుంచి మహారెడ్డి భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై 58,508 ఓట్ల మెజార్టీ, అందోల్ నుంచి చంటి క్రాంతికిరణ్ కాంగ్రెస్ అభ్యర్థిపై 16,465 ఓట్ల మెజార్టీ, జహీరాబాద్ నుంచి కోనింటి మాణిక్‌రావు కాంగ్రెస్ అభ్యర్థిపై 34,473 ఓట్ల మెజార్టీ, పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై 37,699 ఓట మెజార్టీ, హుస్నాబాద్ నుంచి వొడితెల సతీశ్‌కుమార్ సీపీఐ అభ్యర్థిపై 49,964 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.