జహీరాబాద్, ఫిబ్రవరి 24 : వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్‌కు చెందిన ఇరిగేషన్ డీఈఈతో పాటు అతని భార్య, మల్గి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ ఉన్నారు. తీవ్రగాయాలైన వారిలో మృతుడు డీఈ భార్య అక్క, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతీలాల్, జహీరాబాద్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు. గ్రామస్తులు, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇరిగేషన్ శాఖలో కోహీర్ మండల డీఈగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి(42), అతని భార్య విలాసినీ(40), సంగారెడ్డి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు విశాల, మరో ఉపాధ్యాయుడు మోతీలాల్, రాయికోడ్ మండలం ఇటికేపల్లికి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి, న్యాల్కల్ మండలం మల్గి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి కలిసి శనివారం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లారు.
ఆదివారం వీరంతా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం సాయంత్రం కాశీ విశ్వనాథుడి దర్శనం నిమిత్తం కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రయాగ్‌రాజ్ సమీపంలో మీర్జాపూర్ జిల్లా తుల్సి గ్రామ సమీపంలోని రేవా- వారణాసి జాతీయ రహదారిపై వీరు కారు వెళ్తుండగా, అదే రహదారిపై బైక్ రైడర్స్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక బైక్ రైడర్ కారు ముందుకు రావడంతో ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతిచెందాడు, కారు అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్‌కు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇరిగేషన్ డీఈఈ వెంకట్రామిరెడ్డి, అతని భార్య విలాసినీ, కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఉన్న డీఈ వదిన ఉపాధ్యాయురాలైన విశాల, మరో ఉపాధ్యాయుడు మోతీలాల్, జ్ఞానేశ్వర్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. సంఘటనా స్థలాన్ని వారణాసి ఎస్పీ సోమేంద్రనాథ్, అడిషనల్ ఎస్పీ ఏపీ సింగ్ సందర్శించి ఘటనపై ఆరాతీశారు.
న్యాల్కల్ మండలంలోని గంగ్వార్, మల్గి గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుడు ఇరిగేషన్ డీఈ వెంకట్రామిరెడ్డి స్వగ్రామం మండలంలోని మామిడ్గి కాగా, సొంత భూములు ఉండడంతో 20 ఏండ్ల క్రితం గంగ్వార్‌లో స్థిరపడ్డారు. వెంకట్రామిరెడ్డి చాలాకాలం ఏఈగా పనిచేశారు. ఆ తర్వాత వివిధ మండలాల్లో పనిచేసి తర్వాత డీఈగా ప్రమోషన్‌పై కోహీర్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలోని అదర్శ్నగర్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
ప్రతిరోజు సంగారెడ్డి నుంచి విధులకు హాజరవుతున్నారు. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు భార్య, వదినతో పాటు మరో ఇద్దరు కలిసి వెళ్లారు. ఇరిగేషన్ డీఈ వెంకట్రామిరెడ్డి, అతని భార్య విలాసినీ మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారికి ఒక అమ్మాయి, ఒక బాబు ఉన్నారు. కారు డ్రైవర్ మల్లారెడ్డికి ఇద్దరు సంతానం, భార్య ఉన్నారు. ఈ సంఘటనలో తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్న విశాల భర్త, కూతురు కొద్దిరోజుల క్రితం చనిపోయినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకు వచ్చేందుకు సోమవారం ప్రయాగ్‌రాజ్ బయలు దేరారు.
మృతులు ఇరిగేషన్ డీఈఈ వెంకట్రామిరెడ్డి, ఆతని భార్య విలాసినీ, కారు డ్రైవర్ మల్లారెడ్డి మృతదేహాలు గ్రామాలకు తీసుకువచ్చేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారణాసి, మిర్జాపూర్ జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మృతదేహాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు రెసిడెంట్ కమిషనర్ కార్యాలయ ఆధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన విశాల, మోతీలాల్, జ్ఞానేశ్వర్రెడ్డికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వారణాసి ట్రామా కేర్ సెంటర్ చీఫ్ మెడికల్ అఫీసర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.