సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 19: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం రెండోరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులు కావడం విశేషం. తొలిరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్ శెట్కార్ తరఫున ఒకసెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతికి అందజేయగా, రెండోరోజు స్వతంత్ర అభ్యర్థులు బి.మారుతిరావు, కె.ఆనందీశ్వర్ ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరో స్వతంత్ర అభ్యర్థి మహాదేవ్ స్వామి రెండు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జహీరాబాద్ స్థానానికి ఇప్పటి వరకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వివరాలను ఎప్పటికప్పుడు సంగారెడ్డి రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచడంతో పాటు ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం affidavit.eci.gov.in ప్రత్యేక వెబ్సైట్లో చూడవచ్చన్నారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 19: జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ శనివారం నామినేషన్ వేయనున్నారు. ఈ స్థానానికి ఇదివరకే కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్తో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెలేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.