Medak | కొల్చారం, మార్చి 02: మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్లో అంతుచిక్కని వ్యాధితో వెయ్యి కోళ్లు మరణించాయి. సతీశ్ గౌడ్ అనే పౌల్ట్రీ రైతు కోళ్ల ఫారమ్‌లో ఆదివారం నాడు గంటల వ్యవధిలో వెయ్యి కోళ్లు మృత్యువాతపడటం కలకలం రేపాయి. ఈ కోళ్లు ఎండ తీవ్రతతో చనిపోలేదని.. దీనికి సంబంధించి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని చెబితే పశుసంవర్థక శాఖ అధికారులు, కోడి పిల్లలను పంపిణీ చేసిన సూపర్వైజర్లు ఎవరూ పట్టించుకోవడం లేదని సతీశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కోళ్ల అకాల మరణంతో బర్డ్ ఫ్లూ సోకిందేమోనని భయభ్రాంతులకు గురవుతున్నామని సతీశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల అకాల మరణంతో సుమారు రెండు లక్షల వరకు నష్టపోయామని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై పశుసంవర్థక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.