హుస్నాబాద్ టౌన్, నవంబర్ 19: ఆయ్యా మంత్రివర్యా… నేను గుర్తున్నానా… తొమ్మిది నెలలక్రితం మట్టిరోడ్డుగా ఉన్న నన్ను డాంబర్ రోడ్డుచేయాలని శిలాఫలకం కూడా వేసిండ్రు. కానీ, ఇప్పటికి కూడా నేను గుంతలమయమైన మట్టిరోడ్డుగానే మిగిలిపోయాను. రోజు నామీద నుంచి పోయే బండ్లు, పెద్ద పెద్దవాహనాల డ్రైవర్లు నన్ను బాగా తిట్టుకుంటున్నరు. ఎందీ ఈరోడ్డు.. ఎప్పుడు జేత్తరు అని మస్తు గరమైపోతున్నరు అందరు నామీద. నేను మంచిగలేనని చూసి రెండున్నర కోట్ల రూపాయలు నన్ను బాగుచేయడానికి పెట్టిండ్రు…
సంబురంగా అందరు కొబ్బరికాయలు కొట్టి.. స్వీట్లు కూడా తిని పెద్దపెద్ద అక్షరాలతోని శిలాఫలకం అందరూ మస్తు మురిసిపోయేతట్టు ఏసిండ్రు. ఇది జేసినంక నా సంబురం ఆకాశమంత ఎత్తుకు ఎగిరినట్టు అయ్యింది… ఒర్నీ… నా సంబురం సల్లగుండ… ముందు మురిసనట్టే కాని… మల్ల నవ్వుల పాలు అయితన్న… నా రోడ్డు దిక్కుచూసినోళ్లు లేరు… ఆ పని జేసేటోళ్లు లేరు.. ఎందుకో అర్థమైతలేదు. ఈ పని జేపించే ఇంజినీరింగ్ సార్లు పట్టించుకుంటలేరో… నామీద డాంబర్ పోసే కాంట్రాక్టర్ వత్తలేడో తెలియదు కాని, నాకు మాత్రం ఎప్పటిలెక్కనే అందరితోనే తిట్ల పడుతున్న… వాళ్లు తిట్టుడు చూసి మస్తు బాధపడుతున్న… ఇగ మా హుస్నాబాద్ మున్సిపాలిటీ వాళ్లకు ఈ రోడ్డుమీదనే చెత్తతో ఎరువు తయారుచేసే పెద్ద పెద్ద షెడ్లు కూడా ఉన్నయి. దినాం పదకొండు ఆటోలు కూడా రోజు నామీదికెళ్లే నడుత్తన్నయి. వాటివి గేర్లు కరబ్ అవుడు… పట్టీలు పోవుడు అయితంది.
చిన్న చిన్న రిపేర్లు వత్తన్నయి. వీటిని చేయించేతానికి పైసలు ఊక ఇయ్యాల్న అని మా మున్సిపల్ సార్లు కూడా గరం అవుతుండ్రని డ్రైవర్లు మస్తు బాధపడుతుంటే ఏడుపు వత్తంది. గట్ల ఎందుకు అయితంది అని అంటే గుంతలు ఉన్నయి ఏం సెయ్యాలే సారు అని సెప్పి మెల్లమెల్లగా పోతన్నమని మల్ల నన్నే డ్రైవర్లు తిట్టుకుంటండ్రు. నేను ఒక్కదాన్ని సెయ్యబట్టి బండ్లు కరాబు అవుడు. గంతుల కాడ మనుషులు కిందపడి దెబ్బలు తాకించుకునుడు… గిట్ల అందరికీ తకిలీబు అయితందని హుస్నాబాద్ నుంచి మందాపురం దాక మూడుకిలోమీటర్ల మేర డాంబర్రోడ్డు ఏయ్యడానికి సీఆర్ఆర్ కింద 2.50 కోట్ల రూపాయలతోనే మా బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఫిబ్రవరి 26న పెద్ద శిలాఫలక ఏసిండ్రు. సంబురమయితే అయ్యింది. కానీ… డాంబర్ ఎయ్యలేదో… నా ముఖం అందంగా కాలేదు… మరి మంత్రి సారు నన్ను మరిసిపోయిండో ఏమో కాని… జర నా మీదకెళ్లి రోజు మందాపురం ఎల్లటోల్లు జర మీరన్న మంత్రి సాబ్‌కు చెప్పుండ్రి. నన్ను మంచిగజేసి తిట్లులేకుంట రయ్యరయ్యన పోయేతట్టు సెయ్యమని… మరి మంత్రిసారు సెప్పుతడో.. లేక పోనితీ అంటడో… దాని గాచారం గట్లనే పాడయ్యింది అని ఇడిసిపెడుతడో జర సూడలే మరి.