పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 20: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్ట్రీట్ కాస్ సంస్థలో భాగమైన వాటర్ ప్రాజెక్ట్ యూనిట్‌కు చెందిన విద్యార్థులు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని మఖ్తలక్ష్మాపురం గ్రామంలో ఇటీవల పర్యటించారు. మఖ్తలక్ష్మాపురంలో సమస్యలు తెలుసుకొని గ్రామస్తులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని గుర్తించి పలు వీధుల్లో రూ.లక్షా 4 వేలతో వెయ్యిలీటర్లు నిల్వఉండే నాలుగు వాటర్ ట్యాంకులను నిర్మించారు.
విద్యార్థులు గ్రామంలో పర్యటించి నాలుగు ప్రధాన కూడళ్లలో తాగునీటి ట్యాంకులు నిర్మించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దాతలు రవికాంత్‌రెడ్డి, సునీత, స్ట్రీట్కాస్ వాటర్ ప్రాజెక్ట్ యూనిట్ అధ్యక్షులు లాస్య, అసోసియేట్ అధ్యక్షులు మల్లెల సాకేత్, యూనిట్ సభ్యులు కలిసి ఈనెల 17న ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కవితారమేశ్, పల్లె రవి, ముత్యాల గౌరి సహకారం అందించారని యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారు 1800 మంది ప్రజలకు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుందని చెప్పారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
స్ట్రీట్కాస్ సంస్థ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయం. మఖ్తలక్ష్మాపురం గ్రామంలో స్ట్రీట్కాస్ స్వచ్ఛంద సంస్థలో భాగమైన వాటర్ ప్రాజెక్ట్ యూనిట్‌కు చెందిన విద్యార్థులు పర్యటించి తాగునీటి సమస్యను గుర్తించి గ్రామంలో నాలుగు వాటర్ ట్యాంకులు నిర్మించడం సంతోషంగా ఉంది. ఇంకా గ్రామంలో ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలి.
– కవితారమేశ్, సర్పంచ్
గ్రామీణ ప్రాంతాల్లో సేవలు చేయడం హర్షణీయం
హైదరాబాద్‌కు చెందిన స్ట్రీట్కాస్ స్వచ్ఛంద సంస్థలో భాగమైన వాటర్ ప్రాజెక్ట్ విద్యార్థులు గ్రామాల్లో పలు సేవలు అందించడం హర్షణీయం. విద్యార్థి దశలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. విద్యార్థులు ఇలాంటి కార్యక్రకమాలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలుస్తుండడం అభినందనీయం.
– పల్లె ఉమాకాంత్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు