జహీరాబాద్, మార్చి 13: విశ్వమానవ ధర్మ పరిరక్షణ కోసమే దత్తగిరిమహారాజ్ పాదయాత్ర – పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్టు ఝరాసంగం మండలం బర్ధీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ మహాంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. దత్తగిరి మహారాజ్ 46వ వార్షిక ఆమరతిథి సందర్భంగా గురువారం న్యాల్కల్ మండలం మిర్జాపూర్(ఎన్) గ్రామానికి దత్తగిరి మహారాజ్ పాదయాత్ర -పల్లకీసేవ చేరుకున్నది. దత్తగిరి మహారాజ్ పాదయాత్ర -పల్లకీసేవకు భక్తులు భజాభజంత్రీలు, భజన కీర్తనల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో దత్తగిరి మహరాజ్ విగ్రహానికి పూజరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని ముంగి చౌరస్తా మీదుగా ముంగి ఆదిలక్షీ ఆశ్రమానికి చేరుకుంది.
స్థానిక ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పల్లకీసేవకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అటుపై రుక్మాపూర్ మీదుగా హద్నూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి పాదయాత్ర-పల్లకీ సేవ చేరుకుంది. హద్నూర్ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ బర్ధిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవదూత గిరి మహరాజ్, న్యామతాబాద్ అశ్రమ పీఠాధిపతి విశ్వగిరి మహారాజ్, ముంగి ఆదిలక్ష్మి అశ్రమ పీఠాధిపతి దేవగిరి మహారాజ్ భక్తులకు ప్రవచనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.