సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 12: వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఎన్నికల షె డ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలో ఎన్నిక ల నియమావళిని అమలుచేయాలని, అం దుకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. నామినేషన్ దాఖలు ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లపై పూర్తిస్థాయి కంట్రోల్ ఉండాలని, ఎన్నికల నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నిరంతరం పరిశీలించాలన్నా రు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఓట రు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలో ప్రముఖులతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన వీడియోలు రూపొందించాలన్నారు. 18 నుంచి 19 ఏండ్ల వయస్సు గల నూతన ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో వచ్చే మార్పులపై ఎప్పకప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్డీవో పద్మజారాణి, ఆర్డీవోలు పాండు, రాజు, వసంతకుమారి పాల్గొన్నారు.