సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 18 : జీవో 58, 59 కింద భూ క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు పొడిగించినట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో జీవో 58, 59 దరఖాస్తులు, ల్యాండ్ పూలింగ్, ఓటరు జాబితా తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 58, 59 కింద అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్న పేదలు తమ ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీని 2014 జూన్ 02 నుంచి 2020 జూన్ 02 వరకు పొడిగించినట్టు స్పష్టం చేశారు. అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు నూతనంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. తమ పరిధిలో అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గతంలో జీవో 58, 59 కింద తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు తిరిగి దరఖాస్తు చేసుకుకోవచ్చన్నారు. లబ్ధిదారులు 2020 జూన్ 2వ తేదీ లోగా సంబంధిత స్థలం వారి ఆధీనంలో ఉన్నట్టు ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ కింద 25 ఎకరాల భూమిని గుర్తించి స్వాధీనం చేయాలని ఆదేశించారు.
నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలి…
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల భూసేకరణకు కావాల్సిన నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశించారు. నిమ్జ్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, కాళేశ్వరం ప్యాకేజీ 19, ఇరిగేషన్ ట్యాంక్లు, ఆర్అండ్బీ రోడ్స్, జాతీయ రహదారి 161-బీ తదితరాలకు భూసేకరణ పనులపై ఆరా తీశారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ రైతులకు పరిహారం చెల్లింపులు జరగాలని సూచించారు. పేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించి నివేదికను ఇవ్వాలన్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ జనరల్ సమావేశంలో దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి ఈ నెల 24లోగా నివేదిక పంపాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ కారణాలతో ఓటర్ జాబితా నుంచి తొలగించిన పేర్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణ పకడ్బందీగా జరగాలి…
ధాన్యం సేకరణ పకడ్బందీ ప్రణాళికతో సజావుగా జరగాలని డీఎస్వోకు సూచించారు. చౌక ధర దుకాణాల డీలర్ల నియామకాలు పూర్తి చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సర్వేఅండ్ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అవినాష్ నాయక్, డీఎస్వో వనజాత, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.