సంగారెడ్డి ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఫెయిల్ అయ్యింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి దామోదర, ఎంపీ షెట్కార్ హాజరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన జిల్లా ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు కీలకమైన పీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పీఏసీ సమావేశానికి దూరంగా ఉన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పీఏసీ సమావేశానికి హాజరుకాలేదు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారిం ది. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఎ. చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జిల్లా నేత ఉజ్వల్‌రెడ్డి పీఏసీ మీటింగ్ గైర్హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన జిల్లా నాయకుడు గాలి అనిల్‌కుమార్ మీటింగ్‌కు హాజరు కాలేదు.
పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా, మండల స్థాయి నాయకులకు మంగళవారం ఉద యం ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం చెప్పడంపై కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కారణంగా మెజార్టీ నాయకులు పీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టినట్లు కాంగ్రెస్ నాయకులు చర్చించకోవడం కనిపించింది. సంగారెడ్డి జడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీగా రిజర్వు అయ్యింది. మంత్రి దామోదర రాజనర్సింహ తన కూతురును జడ్పీచైర్‌పర్సన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించేందుకు పీఏసీ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే జగ్గారెడ్డి, సంజీవరెడ్డి సహా ముఖ్య నేతలు డుమ్మా కొట్టడంతో మంత్రి దామోదర ముఖ్యనేతల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
వర్గపోరు ఉంటే పార్టీకే నష్టం: దామోదర
సంగారెడ్డిలో నిర్వహించిన పీఏసీ కమిటీ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ తన ప్రసంగంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పీఏసీ కమిటీ మీటింగ్‌కు ముఖ్యనేతలు గైర్హాజరుకావడంపై అసంతృప్తి చెందిన ఆయన నాయకుల్లో వర్గపోరు ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందని, ఇది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. జహీరా బాద్ ఎంపీ షెట్కార్ ప్రభుత్వ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభు త్వం తీసుకువచ్చిన పథకాలు అమలు చేయడంలో అధికారులు సరిగ్గా వ్యవహరించడంలేదన్నారు.