మనూరు, మే 18: మాయికోడ్-మనూరు మధ్యన వాగు వెంట ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే పలు గ్రామాల ప్రజలు ఈ వాగుపక్కన ఉన్న రోడ్డు నుంచే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనూరు మండలంలోని మాయికోడ్, రాణాపూర్, తుమ్నూర్, ముగ్ధూంపూర్, దుదగొండ, బోరంచ, దన్వార్, ఉసిరికెపల్లి, రాయిపల్లి గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా ఉంది.
ఒకవైపు బావి, మరోవైపు వాగు ఉండడంతో ప్రయాణం కత్తిమీద సాములా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం వర్షాకాలంలో మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. వాగు దగ్గర వేసిన సీసీ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో వర్షాకాలం ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి వాగులో పడే ప్రమాదం పొంచి ఉంది.
జూన్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పేలా లేవు. రోడ్డు సరిగ్గా లేక అనేక గ్రామాలకు బస్సుసౌకర్యం లేకుండా పోయింది. ఈ రోడ్డు ప్రమాద కరంగా మారడంతో ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.