సిద్దిపేట, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రహదారి వెంట బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ కాన్వాయ్‌లో కార్లలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాహనాల్లో తరలివెళ్లారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు కేసీఆర్ బయలుదేరారు. రాజీవ్ రహదారి వెంట కార్యకర్తలు గులాబీ జెండాలు చేతబట్టి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రజ్ఞాపూర్, కుకునూరుపల్లి, కొండపాక, సిద్దిపేట రంగధాంపల్లి, శనిగరం స్టేజీల వద్ద ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వాహనాలతో కేసీఆర్ కాన్వాయ్‌లో కలిసి ముందుకు సాగారు.
మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి క్రాసింగ్ వద్ద మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కేసీఆర్‌కు స్వాగతం పలకడానికి కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్, కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇతర పార్టీ నేతలు అక్కడి చేరుకున్నారు. బెజ్జంకి క్రాసింగ్ వద్దకు 11.58 గంటలకు కేసీఆర్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి నేతృత్వంలో రైతులు, పార్టీ శ్రేణులు వరి కంకులతో కేసీఆర్‌కు స్వాగతం పలికారు. 10 నిమిషాల పాటు కాన్వాయ్ ముందు పార్టీ శ్రేణులు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని, చేతికొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయని రైతులు చెప్పారు. కేసీఆర్ బస్సులో నుంచి పార్టీ శ్రేణులకు, రైతులకు అభివాదం చేశారు. అందిరికీ నమస్కారం చెబుతూ ముందుకు సాగారు. కేసీఆర్ కాన్వాయ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. పార్టీ క్యాడర్‌కు ఆయన కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు.
బస్సులో నుంచే పార్టీ శ్రేణలకు, ప్రజలకు, రైతులకు కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ప్రత్యేక బస్సులో కేసీఆర్ ముందు కూర్చున్నారు. పక్కనే కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ కూర్చున్నారు. చాలా గ్రామాల వద్ద పార్టీ శ్రేణులు కాన్వాయ్‌ను ఆపుతుండడంతో పదండి ముందుకు అంటూ కేసీఆర్ సైగలు చేస్తూ ముందుకు కదిలారు. కేసీఆర్ విజయ సంకేతం చూపారు. రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా రాజీవ్ రహదారి గుండా కేసీఆర్ కాన్వాయ్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా కేసీఆర్ పర్యటన షెడ్యూల్ లేనప్పటికీ కేసీఆర్‌కు స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు, రైతులు, అభిమానులు కదిలివచ్చారు.
కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో వెళ్లడంతో తెలంగాణ ఉద్యమ రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చింది. నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ఇదే తరహాలో భారీ కాన్వాయ్‌తో వెళ్లేవారు. మళ్లీ కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో వెళ్లడంతో క్యాడర్లో ఉత్సాహం కనిపించింది. పదవులు అనుభవించినవారు పార్టీని వీడి వెళ్తున్నా కార్యకర్తలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేసీఆర్ పర్యటనలో కార్యకర్తల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది. కిలోమీటర్ల పొడవునా కాన్వాయ్ కదిలింది. రాజీవ్ రహదారికి ఇరువైపులా ఆయా గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ ఉత్సాహం చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుస్తున్నది. ఇవాళ ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు, వచ్చిపోయే కరెంట్, కష్టాల్లో రైతులు కనిపిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు చర్చించుకున్నారు.
మర్కూక్, ఏప్రిల్ 5: ఎండిన పంట పొలాలను కరీంనగర్ జిల్లాలో పరిశీలించేందుకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరేముందు మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రం వద్ద సుమారు 100 కార్లలో కార్యకర్తలు సందడి చేశారు. వ్యవసాయ క్షేత్రంలోని భవనం వద్దకు ములుగు, మర్కూక్, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చారు.