నాడు అన్నదాతలకు అండగా నిలిచిన పెద్దవాగు ప్రాజెక్ట్, నేడు వృథాగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పేరుగాంచిన పెద్దవాగు ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ప్రాజెక్టు అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
కోహీర్, ఆగస్టు 6: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొటిగార్పల్లి గ్రామ శివారులో పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. అందులో ఎల్లప్పుడూ నీరు పుష్కలంగా ఉంటుంది. కర్ణాటకలోని బోనస్పురం, లస్మాసాగర్, బస్వపురం, బోపునారం, మాచారం, కుంచారంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని తొరమామిడి, శివరాంపురం, మగ్దుంపురం, పోచారం, తదితర గ్రామాల్లో కురిసిన వర్షపు నీరు పెద్దవాగు ప్రాజెక్టులోకి చేరుతుంది. నీటితో నిరంతరంగా కళకళలాడుతుంది.
1100 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును 50 ఏండ్ల క్రితం నిర్మించారు. కుడి,ఎడమ కాలువల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5.3 కిలోమీటర్ల పొడవున్న కుడి కాలువ ద్వారా 550 ఎకరాలు, 7.2 కిలో మీటర్ల దూరం వరకు ఉన్న ఎడమ కాలువ ద్వారా 550 ఎకరాలకు సాగునీటిని అందించాలని అప్పట్లో నిర్ణయించారు. కుడి కాలువ ద్వారా గొటిగార్పల్లి, పర్శపల్లి, మల్చెల్మ శివారు ప్రాంతం, సెడేగుట్టతండా, శేఖాపూర్ గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందించారు.
ఎడమ కాలువ ద్వారా వెంకటాపూర్, మల్చెల్మ, మల్కాపురం గ్రామాల రైతులకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో తూమ్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. కాలువలు పిచ్చి మొక్కలతో నిండిపోయి నీటి సరఫరాకు పనికి రాకుండా మూసుకుపోయాయి. దీంతో రైతుల పొలాలకు సాగునీరు అందడం లేదు. తద్వారా రైతులు వర్షాదార పంటల సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. ప్రాజెక్టు కట్ట 480మీటర్ల పొడవు ఉంది. దానిపై అక్కడక్కడా రంధ్రాలు పడ్డాయి.
అలుగుకు ఆనుకుని ఉన్న ఫాలింట్ షట్టర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాజెక్టు నిండిన సమయంలో చెడిపోయిన ఫాలింగ్ షట్టర్ల ద్వారా నీరంతా వృథాగా బయటకు పోతున్నది. వృథాగా వెళ్లే నీటిని కాపాడేందుకు ఇంత వరకు వాటికి మరమ్మతులు చేపట్టలేదు. నీటినిల్వ కోసం అలుగు ఎత్తును పెంచుకునే అవకాశం ఉన్నా, దానిపై ఏమాత్రం దృష్టిసారించడం లేదు. ఆరేండ్ల క్రితం ప్రాజెక్టు అభివృద్ధి కోసం రెండు రూ.2 కోట్ల నిధులు కేటాయించినా, వాటిని సరిగ్గా వినియోగించుకోలేదు. యంత్రాలతో పనులను ప్రారంభి ముళ్లపొదలు తొలిగించారు. అప్పట్లో కరోనా ప్రభావంతో అర్ధాంతరంగా పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
Medak3
పనిచేయని ఎత్తిపోతల పథకం..
గొటిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్టు నుంచి 1100 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించాలని యంత్రాలు, పరికరాలు బింగించారు. కట్ట సమీపాన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు సైతం ఏర్పాటు చేయించారు. 60హెచ్పీ కెపాసిటీ ఉన్న మూడు మోటర్లతో నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. 1990 వరకు ఈ పథకం సజావుగానే కొనసాగి సాగునీటిని అందించారు. కానీ, విద్యుత్ పరికరాలు, యంత్రాలు ఖరీదుతో కూడినవి కావడంతో వాటిపై దొంగలు దృష్టి పెట్టారు. ప్రత్యేక గదిలో అమర్చిన మూడు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు దోచుకెళ్లారు.
దీంతో పథకం రెండు దశాబ్దాలకు పైగా మరుగునపడింది. ఎత్తిపోతల ద్వారా దియోని పశుత్పత్తి కేంద్రానికి నీటిని సరఫరా చేసేవారు. ఆ ప్రాజెక్టు నీటితో అక్కడ ఉండే పశువుల దాహార్తిని తీర్చేవారు. యంత్ర పరికరాలు చోరుల చేతుల్లోకి వెల్లడంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడ్డాయి. దీంతో రైతుల పొలాలకు, దియోని పశుత్పత్తి కేంద్రానికి నీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా భూములన్నీ బీడుగా మారాయి.
సామగ్రి దొంగలు ఎత్తుకెళ్లారు…
ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపింగ్ చేసేందుకు మూడు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ ఒక గదిలో ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు బాగానే నడిచింది. దొంగలు వాటిని ఎత్తుకెళ్లారు. 25 ఏండ్ల నుంచి రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచించాలి.
– ఎల్లారెడ్డి, ప్రాజెక్టు చైర్మన్, గొటిగార్పల్లి
నీరు వస్తేనే పంటల సాగు…
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. సాగునీరు లేక వృథాగా ఉంది. కాలువలను మంచిగ చేసి నీటిని అందిస్తే పంటలు సాగుచేస్తాం. నీళ్లు లేక భూమి వృథాగా మారింది. ప్రభుత్వం రైతులపై కనికరం చూపాలి. ప్రాజెక్టును బాగు చేస్తే పంటలు పండి మా బతుకులు మారుతాయి.
– నారాయణ, రైతు, గొటిగార్పల్లి
ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తాం..
పెద్దవాగు ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి స్తాం. కల్వర్టులు, తూమ్ లీకేజీలు, అలుగు, కాలువల మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతాం. గొటిగార్పల్లితో పాటు పైడిగుమ్మల్, పర్సపల్లి, బడంపేట, దిగ్వాల్, చింతల్ఘాట్ చెరువుల అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం.
– రవీందర్, నీటి పారుదలశాఖ ఏఈ, సంగారెడ్డి జిల్లా