హుస్నాబాద్, మే 29: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని ఎల్లమ్మ చెరువులో గండికొట్టి నీటిని వృథాగా బయటకు విడుదల చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు కాంట్రాక్టర్ తవ్విన గండిని పూడ్చడంలో నిర్లక్ష్యం చేసిన నీటి పారుదల శాఖ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అండతోనే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా తూమును తెరవడం, చెరువుకు గండికొట్టి నీటిని విడుదల చేస్తున్నాడని ఆరోపించారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ చేపలు పట్టుకునేందుకు వీలుగా చెరువులోని నీటిని బయటకు పంపేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా తూము తెరవడంతోపాటు తూములోకి నీళ్లు వెళ్లేలా గండికొట్టాడు. ఈ విషయంపై రైతులు సంబంధిత నీటిపారుదల శాఖ డీఈఈ నందాకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులైనా గండిని పూడ్చక పోవడంతో బుధవారం ఉదయం చెరువు వద్దకు చేరుకున్న ఆయకట్టు రైతులు సొంత ఖర్చులతో జేసీబీ తెప్పించి గండిని పూడ్చివేశారు.
సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, రైతులు బొలిశెట్టి సుధాకర్, ఆకుల శ్రీనివాస్, కొమురయ్యలతోపాటు మరో పదిమంది రైతులు చెరువు తూము వద్దకు చేరుకొని అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడురోజులుగా తూము ద్వారా ఏకధాటిగా నీరు బయటకుపోవడంతో చెరువులో దాదాపు ఆరు అడుగుల నీళ్లు తగ్గిపోయాయని, ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. చెరువులో నీళ్లుంటే వర్షాలు ఆలస్యంగా కురిసినా పశువులు, పక్షులకు నీళ్లు దొరకడంతోపాటు బావుల్లో నీళ్లు ఉండే అవకాశం ఉంటుందన్నారు. చెరువు ఎండిపోతే బావులు ఎండిపోయి తాగేందుకు కూడా నీళ్లు దొరకవనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం చెరువు వైపు చూడకపోవడం ఏంటని ప్రశ్నించారు. అనుమతి లేకుండా జేసీబీతో గండికొట్టి, దర్జాగా తూమును తెరిచి నీళ్లు బయటకు పంపుతున్నాడంటే కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కయ్యారనేది స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనపై విచారణ జరిపి గండికొట్టిన వారితోపాటు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
మూడురోజులుగా తూము నుంచి చెరువు లోని నీళ్లు వృథాగా పోతున్నప్పటికీ నీటిపారుదల శాఖ అధికారు లు పట్టించుకోక పోవడం అన్యాయం. గతేడాది వర్షాలు తక్కువగా పడి చెరువులో కొద్దిపాటి నీళ్లే ఉన్న య్. ఉన్న నీళ్లను కూడా చేపలు పట్టుకునే నెపంతో ఖాళీ చేస్తే ఆయకట్టు రైతులు, పశుపక్ష్యాదులు ఏం కావాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే చెరువులోని నీళ్లు సగంవరకు వృథాగా పోయాయి. ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.