గజ్వేల్, జూన్ 17: కుటుంబ కలహాలు చిన్నారుల ప్రాణాల మీదికొచ్చింది. అభం శుభం తెలియని చిన్నారులతోపాటు తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని జాలిగామలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి మానస, రాజు దంపతులకు నాలుగేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆనన్య(3), సహస్ర 11నెలల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో తల్లి మానస ఇద్దరు కూతుళ్లకు చున్నికట్టి నీటి సంపులోకి ముంచుతూ పైకి లేపడంతో వారు అపస్మారక స్థితిలోకి చేరుకోగానే వారిద్దరినీ పైకి తీసింది. అనంతరం ఇంట్లో తల్లి మానస ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి విఫలమైంది. దీంతో వెంటనే పక్కింటికి వెళ్లి విషయం తెలిపింది.
గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించి గజ్వేల్లోని దవాఖానకు తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లను తరలించారు. ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలో ఉండగా పరిస్థితి క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతున్న ఇద్దరు అక్కాచెల్లెండ్ల పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి మానస గజ్వేల్ దవాఖానలో చికిత్స పొందుతుండగా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఇంట్లో పరిస్థితిని గమనించి వివరాలు సేకరించారు.