చేగుంట, జనవరి25: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనమైన విషాద ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగింది. చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నశివునూర్ గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వారు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నెల 24న అంజమ్మ(59), ఆమె చిన్న కుమారుడి కూతురు మధు (6)తో కలిసి చిన్నశివునూర్ గ్రామానికి రేషన్ బియ్యం, పింఛన్ డబ్బు కోసం వచ్చారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి, వారింటికి నిప్పంటుకున్నది. దీంతో అంజమ్మ, మధు సజీవ దహనం అయ్యారు. సిలండర్ పేలిన శబ్ధం రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు, సర్పంచ్ కొటారి అశోక్, చేగుంట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫైరింజిన్ సహాయంతో మంటలు అర్పించారు. గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
చిన్నశివునూర్లో ఇలాంటి ఘటనలు జరుగడం చాలా బాధాకరమని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని రకాల బెనిఫిట్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. సంబంధిత గ్యాస్ ఎజెన్సీ ఇన్సూరెన్స్ వచ్చేలా సంబంధింత అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచ్ కొటారి అశోక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాక స్వామి, సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, మ్యాకల పరమేశ్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు ఉన్నారు.