సంగారెడ్డి, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నది. సమ్మె రెండో రోజు గురువారం ఆర్టీసీ కార్మికులు డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా, బస్సులను అడ్డుకుంటే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. డిపోల బయట కార్మికులు నిరసనలు తెలపకుండా పోలీసులతో ప్రభుత్వం అడ్డుకున్నది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జేఏసీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల్లోని కార్మికులు రెండో రోజు విధులు బహిష్కరించి సమ్మెలో పాలుపంచుకున్నారు.
సంగారెడ్డి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు డిపోల నుంచి బస్సులు కదలకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కార్మికులను బలవంతంగా తొలిగించి డిపోల నుంచి ప్రైవేటు బస్సులు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి బస్టాండు వెలుపల టెంట్ వేసుకుని నిరసన తెలుపుతున్న కార్మికులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పోలీసుల చర్యలను కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు బలవంతంగా టెంట్‌ను తొలిగించారు. సంగారెడ్డి డిపో పరిధిలోని కార్మికులు మధ్యాహ్నం బస్టాండు వెలుపల ఆర్టీసీ కార్మికులు వంటావార్పుకు సిద్ధం కాగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులు డిపోల వెలుపల ధర్నా, ర్యాలీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పోలీసుశాఖ ఆర్టీసీ జేఏసీ నాయకులకు సూచించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం, పోలీసుశాఖ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం సమ్మెను బలవంతంగా అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని జేఏసీ నాయకులు మండిపడ్డారు. నారాయణఖేడ్ డిపోలో ఆర్టీసీ కార్మికులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు బలవంతంగా తొలిగించడంతో ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. నారాయణఖేడ్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంఘీబావం తెలిపారు. జహీరాబాద్ డిపోలో కార్మికులు రెండోరోజు సమ్మెలో పాల్గొనగా, ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆర్టీసీ కార్మికులను కలిసి సమ్మెకు సంఘీబావం తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు జహీరాబాద్ డిపోలోని కార్మికులను కలిసి సమ్మెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

గురువారం పోలీసు పహారాలో సంగారెడ్డి జిల్లాలోని మూడు డిపోల పరిధిలో మొత్తం 240కిపైగా బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. వీటిలో 70కిపైగా ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను ప్రైవేటు ఉద్యోగులతో నడిపించారు. సంగారెడ్డి డిపో పరిధిలోని 30కిపైగా బస్సులు వేర్వేరు రూట్లలో తిరిగాయి. నారాయణఖేడ్ డిపోలో 20, జహీరాబాద్ డిపో పరిధిలో 20 బస్సులు నడిచాయి. మహాలక్ష్మీ పేరిట బస్సులను నడిపించారు. ప్రైవేటు ఉద్యోగులతో బస్సులు నడపడంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. శుక్రవారం నుంచి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఆర్ఎం ఉదయభాస్కర్ తెలిపారు. సమ్మెను వీడి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఆయన కోరారు.
మెదక్ జిలాలోని మెదక్, నర్సాపూర్ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు గురువారం మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మద్దతు తెలిపారు.గుల్షన్‌క్లబ్ వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చేస్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేందుకు యత్నించగా, పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికుల ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పాపన్నపేట, శంకరంపేట(ఆర్), వెల్దుర్తి సీఎస్‌లకు తరలించారు.మెదక్ డిపో వద్ద కార్మికులు సమ్మె చేస్తే పోలీసులు టెంట్ తొలిగించారు. మెదక్ ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గుల్షన్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ, సీపీఎం నాయకులను పోలీసు లు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్,దుబ్బాక, హుస్నాబాద్ డిపోల వద్ద గురువారం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. సిద్దిపేటలో వంటావార్పు, దరువు వేస్తూ నిరసన తెలిపారు.