వర్గల్,మే 21: ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శనిలా దాపురించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం వర్గల్ మండలం మైలారంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే సర్కారుకు కనీసం పట్టడం లేదన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర, రూ.500 బోనస్ ఇవ్వలేని ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎలా? చేస్తుందన్నారు.
వానకాలం దగ్గర పడుతున్నా అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కాంగ్రెస్ విఫలమమైందని విమర్శించారు. సన్నవడ్లు, దొడ్డు వడ్లు అని తేడాలేకుండా అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. సరైన సమయంలో కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో రైతులు రైస్‌మిల్లుల్లో తక్కువ ధరకే ధాన్యం అమ్మాల్సి వచ్చిందన్నారు.వానకు తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. పింఛన్ల పెంపు, తలం బంగారం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు.