ఫిబ్రవరి 4: కనుమరుగవుతున్న పాత పంటలను రక్షించి భావితరాలకు అందిస్తూ, జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. శనివారం మండలంలోని గుంజోట్టి, హుస్సేల్లి గ్రామాల్లో డీడీఎస్ ఆధ్వర్యంలో పాతపంటల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో డీడీఎస్ జాతర సూపర్వైజర్ వినయ్‌కుమార్, చుక్కమ్మ మాట్లాడుతూ పాతపంటలైన తైదలు, కొర్రలు, సామలు, రాగులు, అవిసలు, సజ్జ, జొన్న, పెసర, మినుము తదితర పంటలతో అనేక ప్రయోజనాలుంటాయన్నారు. కాలానుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అనంతరం ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పాతపంటలను కాపాడుతూ, సాగుచేసేందుకు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఆయా గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా పాతపంటల విత్తనాలతో అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు, మహిళలు చేపట్టిన కోలాటం, చిటికెల రామాయణం, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ పాత పంటల జాతరలో హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఎన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు పాల్గొని తిలకించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సుధారాణీ, చెన్నమ్మ, నాయకులు చంద్రప్ప, వెంకట్‌రెడ్డి, డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు నర్సమ్మ, మంజుల, కమలమ్మ, పూలమ్మ, గ్రామ మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.