సంగారెడ్డి ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): ఐఐటీ హైదరాబాద్‌లో గురువారం ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫెయిర్ 2023 వేడుకలా జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు ఫెయిర్‌లో పాల్గొని తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఉదయం 10.30గంటలకు ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆవిష్కరణలను ఐఐటీ ప్రొఫెసర్ల బృందం తిలకించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ఆవిష్కరణల గురించి ఇంగ్లిష్‌లో చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తమ మూడు ఆవిష్కరణలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు కన్సొలేషన్ బహుమతులను ప్రకటించారు. శుక్రవారం నిర్వహించనున్న ఐఐటీ వ్యవస్థాపక దినోత్సవంలో విజేతలకు ప్రదానం చేయనున్నారు. ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫెయిర్‌లో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తామూ ఐఐటీలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రమాదాల నివారణకు దోహదం..ఆటోలైట్ మెకానిజం
రాత్రి వేళల్లో కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీ కొనకుండా నివారించేందుకు ఖమ్మం జిల్లా మణుగూరులోని ఎక్స్లెంట్ స్టార్ హై స్కూల్ విద్యార్థి ఎండీ రయాన్ తయారు చేసిన ఆటోలైట్ మెకానిజం కన్సోలేషన్ బహుమతి పొందింది. ఆటోలైట్ మెకానిజం గురించి రయాన్ వివరిస్తూ ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్న వార్తలు తనను ఎంతో బాధించాయని, ముఖ్యంగా బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద ఎదురెదురుగా వస్తున్న వాహనాలు డిప్పర్ లైట్(లోయర్ బీమ్) వేయకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించానన్నాడు. దీనిని అరికట్టేందుకు ఆటోలైట్ మెకానిజం రూపొందించినట్లు తెలిపాడు. బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద తాను తయారుచేసిన ఆర్వీ యాంటినాలను బిగించాలని, అలాగే వాహనాల్లో సైతం రిసీవర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీంతో వాహనాల లైట్లు కల్వర్టులు, బ్రిడ్జిల వద్దకు చేరుకోగానే ఆటోమేటిక్‌గా డిప్పర్లోకి మారతాయని, తద్వారా ప్రమాదాలు జరగవని తెలిపాడు.
మహిళలకు వరం… వంటమిత్ర
మహిళలు సులువుగా అన్నం వండేందుకు వీలుగా సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీహెచ్ఎస్ తొమ్మిదవ, ఎనిమిదో తరగతి విద్యార్థులు వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియలు వంటమిత్రను రూపొందించారు. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే మహిళ లక్ష్మి పడుతున్న ఇబ్బందులను గమనించి తాము వంటమిత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. భారీ వంటపాత్రలో సులువుగా అన్నం వండి వార్చేందుకు వీలుగా యంత్రాన్ని తయారుచేశారు. దీన్ని అతి తక్కువ ఖర్చుతో తయారు చేయడంతో పాటు ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చని అన్నారు. ఈ ఆవిష్కరణకు కన్సొలేషన్ బహుమతి లభించింది.
ప్రమాదాల నివారణకు యూటర్న్ లైట్స్
రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు స్ట్రెయిట్, యూటర్న్ లైట్స్ ఇండికేటర్లను నిజామాబాద్ జిల్లా పడగల్
జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించారు. పదవ తరగతి విద్యార్థి బి.అఖిల, ఎనిమిదో తరగతి విద్యార్థి జి.అలోక కలిసి ఈ ఇండికేటర్లను తయారుచేశారు. తమ ఆవిష్కరణ గురించి వివరిస్తూ ప్రస్తుతం అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాల్లో రైట్, లెఫ్ట్ ఇండికేటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. అయితే, యూటర్న్, స్ట్రెయిట్ ఇండికేటర్లు లేకపోవటంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని, వీటిని నివారించేందుకు తాము కొత్తగా యూటర్న్, స్ట్రెయిట్ ఇండికేటర్లను రూపొందించామని, ఇవి వాడితే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
రోడ్ ప్యాచ్‌లతో గుంతలు మాయం
రహదారులపై పడే గుంతల మూలంగా ప్రమాదాలు చోటు చేసుకోవటంతో పాటు వాహనాలు త్వరగా రిపేర్‌కు వస్తాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ములుగు జిల్లా రామగుండం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి రక్షిత రోడ్ ప్యాచ్‌లను రూపొందించింది. తన ఆవిష్కరణ గురించి రక్షిత వివరిస్తూ ప్రస్తుతం రహదారులపై గుంతలను పూడ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు కంకర, తారు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో స్కేర్ ఫీట్‌కు రూ.800 ఖర్చు అవుతుందని, అయితే సహజంగా లభించే జనపనార, రబ్బర్, ఫైబర్, వ్యర్థ ప్లాస్టిక్‌ను ఉపయోగించి తాను రోడ్ ప్యాచ్‌లను తయారు చేసినట్లు తెలిపింది. ఈ ప్యాచ్‌లను నేరుగా గుంతలు ఉన్న చోట అతికించవచ్చని, ఇందుకు స్కేర్ ఫీట్‌కు రూ.400 ఖర్చు అవుతుందని తెలిపింది. దీంతో ఖర్చు తగ్గడంతో పాటు మన్నిక ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నది.
ఆచార్య దేవోభవ
నిజామాబాద్ జిల్లా బిక్కనూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కార్త్తికేయ, కేవీ వాసు ఆచార్య దేవోభవ అనే యంత్రాన్ని రూపొందించారు. ఈ ఆవిష్కరణ గురించి విద్యార్థులు వివరిస్తూ కొవిడ్ సమయంలో పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు లేకపోవటంతో విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు దూరమయ్యారని అన్నారు. మళ్లీ అటువంటి పరిస్థితులు వస్తే పరిష్కరించేందుకు ఆచార్య దేవోభవ రూపొందించినట్లు తెలిపారు. పాఠాలను మొదట రికార్డు చేసి ఆ తర్వాత ఆ రికార్డులను ఆచార్య దేవోభవ యంత్రంతో అనుసంధానం చేస్తే గ్రామాల్లోని విద్యార్థులకు తమకు నచ్చిన సమయంలో పాఠాలు స్పీకర్ ద్వారా వినిపించవచ్చని వివరించారు.
స్మార్ట్ డ్రైనేజీ ఇండికేటర్
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసన సమయంలో మ్యాన్‌హోళ్లు తెరుచుకుని మనుషులు చనిపోవటంతో పాటు రోడ్డుపై డ్రైనేజీ వాటర్ పొర్లుతుందని, దీనిని నివారించేందుకు హైదరాబాద్‌కు చెందిన పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు వినూత్న, సాహితీ, సింధూలు స్మార్ట్ డ్రైనేజీ ఇండికేటర్ యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రం సెన్సార్లు, ఇండికేటర్లతో అనుసంధానం చేసి ఉంటుందని, సెన్సార్లను మ్యాన్‌హోల్ వద్ద బిగిస్తే మ్యాన్‌హోల్ తెరుచుకున్నప్పుడు, మురికినీరు బయటకువచ్చి ప్రవహించినప్పుడు సెన్సార్లు వెంటనే పసిగట్టి కమాండ్ సెంటర్‌కు సమాచారం పంపుతుందని, కమాండ్ సెంటర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు.
వృద్ధులకు అండనిచ్చే ఊతకర్ర
వయోవృద్ధుల చేతిలో సులువుగా ఇమడటంతో పాటు వారు కింద పడితే కుటుంబ సభ్యులను హెచ్చరించే ఊతకర్రను దమ్మన్నపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నితిన్, మనోహర్, రాకేశ్ రూపొందించారు. అతి తక్కువ వ్యయంతో ఈ ఊతకర్రను తయారు చేశామని, ఊతకర్రకు అనుబంధంగా టాయిలెట్ వెళ్లేందుకు వీలుగా సీటును ఏర్పరిచినట్లు తెలిపారు. దీంతో దూరం నడవలేని వృద్ధులు ఈ టాయిలెట్ సీట్‌ను వాడుకోవచ్చన్నారు. వృద్ధులు అకస్మాత్తుగా కింద పడిపోతే కుటుంబసభ్యులకు హెచ్చరికను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తమ ఆవిష్కరణకు డిసేబుల్డ్ అండ్ ఎల్డర్లీ ఫ్రెండ్లీ వాకింగ్ స్టిక్‌గా నామకరం చేసినట్లు విద్యార్థి నితిన్ తెలిపాడు.