చేర్యాల, అక్టోబర్ 14: మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపేందుకు ప్రారంభించిన గ్రావిటీ కెనాల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పనులు చేపట్టాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దేవాదుల 8వ ప్యాకేజీలో భాగంగా తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, చేర్యాల మండలంలోని కాల్వలు, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ, చేర్యాల మండలంలో అసంపూర్తిగా ఉన్న కాల్వల పనులు పూర్తి చేయాలని, రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. అసంపూర్తి కాల్వ పనులు వేగంగా పూర్తి చేయాలని, తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల నుంచి సీపేజీ ఎక్కువగా ఉన్నందున్న, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గేట్లు, తూములను రిపేర్ చేయాలని, అన్ని చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
జనగామ నియోజకవర్గంలో లిఫ్ట్-1 పనులకు సంబంధించి పైప్‌లైన్ పనులు పూర్తి అయినప్పటికీ, మరికొన్ని చెరువులకు పైప్‌లైన్ వేయాలని, పంపుహౌస్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరారు. చెరువుల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేసి సరైన సమయంలో పనులు ప్రారంభించాలన్నారు. మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించడంతో పాటు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.