పటాన్చెరు, డిసెంబర్ 30: బహుళ జాతి సంస్థల్లో ఉపాధి కోసం ప్రతిభ అవసరమని క్లిన్క్సీ సొల్యూషన్స్ సీఈవో మేమవరపు సతీశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసీ విద్య తరువాత ఉద్యోగ అవకాశాలు, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సతీశ్‌కుమార్ మాట్లాడుతూ అభ్యాసం అనేది జీవితానికి సంబంధించిన నిరంతర ప్రక్రియ అన్నారు. పురోభివృద్ధికి సోపానమని, నేర్చుకోవడం, ఆలోచించడం మానేస్తే జీవితంలో సృజనాత్మకత, జ్ఞానం ఉండదన్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి ఉద్యోగం పొందాలంటే, ముందుగా సాధించాలనే తపన, ఉన్నత లక్ష్యం, నిరంతర అభ్యాసం ఉండాలని సూచించారు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణా సామర్ధ్యం, వినయం వంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సామర్ధ్యాలు కళాశాలలే సరైన వేదికలన్నారు.
గ్రంథాలయాలు మీకు తోడ్పాటు అందిస్తాయన్నారు. అందరిలో ఒకరిగా కాకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని, అప్పుడే కొత్త ఆలోచనలు, నవకల్పనలను ప్రదర్శించగలమన్నారు. శాస్త్రీయ, వైద్య, సాహిత్య రచనా వ్యాసంగాలను చేపట్టడానికి విద్యార్థి దశలోనే పరిశోధనా పత్రాలు ప్రచురించడం అలవర్చుకోవాలని, అటువంటి వారినే మానవ వనరుల విభాగం వారు ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. ఫార్మసీతో పాటు ఇతర రంగాలపై అవగాహన ఉన్నవారికి ఉద్యోగాలకు ఢోకా ఉండదన్నారు. కార్యక్రమంలో ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బీ.దుర్గాప్రసాద్, స్కూల్ ఆఫ్ ఫార్మసీకి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.