సంగారెడ్డి,మే 26(నమస్తే తెలంగాణ) : యువతలో భారతీయ కళల పై ఆసక్తి పెరుగుతుండడం శుభ పరిణామమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ యూత్(స్పిక్‌మాకే) పదో అంతర్జాతీయ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గతంలో ఢిల్లీ, ఖర్గ్పూర్, నాగ్‌పూర్‌లో నిర్వహించిన స్పిక్‌మాకే తాను సమ్మేళనాలకు హాజరైనట్లు తెలిపారు.
త్రిపురలో స్పిక్ మాకే కార్యక్రమాలకు హాజరైనట్లు తెలిపారు. త్రిపురలో మహారాజుల పాలనలో హిందుస్తానీ సంగీతం ప్రజాదరణ పొందినట్లు తెలిపారు. ఆ తర్వాత త్రిపురలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత కళా ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రయత్నం జరిగినట్లు చెప్పారు. స్పిక్‌మాకే భారతీయ కళలు, కళారూపాలు, సంస్కృతిని రక్షించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్రిపుర నృత్య రూపకం హోజాగిరి సంరక్షించడంలో స్పిక్‌మాకే కృషి అభినందనీయం అన్నారు.
భారతీయ సాంస్కృతిక, కళా వారసత్వ రక్షణకు ఉద్యమం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న కళలు, కళారూపాలను రక్షించి భారతీయ ఆత్మను చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. ధర్మం అంటే ఆలోచన విధానమని, మతం అంటే పూజించే విధానమని, ఈ రెండింటిని కలిపి గందరగోళానికి గురికావద్దని ప్రజలను గవర్నర్ కోరా రు. గురువులు శిష్య పరంపర కొనసాగడం ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. మొదటిరోజు కూచిపూడి కళాకారులు రాజ, రాధారెడ్డి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
వయోలిన్ విద్యాంసలు డా.ఎన్.రాజమ్ ప్రదర్శన ఆహూతులను అలరించింది. కార్యక్రమంలో ఐఐటీ డైరక్టర్ బీఎస్ మూర్తి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ , స్పిక్‌మాకే వ్యవస్థాపకులు డా.కిరణ్ సేథ్, స్పిక్‌మాకే ప్రతినిధులు మహేంద్రకుమార్, రాథామోహన్ తివారి, కోన లక్ష్మీ, కళాపూర్ణ, ఐఐటీహెచ్ ప్రొఫెసర్ మధుసూదన్, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.