మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 9: తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి తొలి విడత ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ వ్యయ పరిశీలకులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలి విడత పోలింగ్ ఈనెల 11న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. తొలి విడతలో 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని, మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉండగా.. 37,5 62 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సర్పంచ్ స్థానాలకు 12,960 మంది వార్డు స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు పోటీలో చేస్తున్నరన్నారు.
ఓటర్లు ఓటర్ ఐడీ లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒక దానిని చూపించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్ అనుమతించ బడదన్నారు. పోలింగ్ సమయం ముగిసే 48 గంటల ముందు నుంచి మద్యం అమ్మకాలు, పంపిణీపై నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఫలితాల ప్రకటన అనంతరం వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని, ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛ వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని సూచించారు.

Medak2
తొలి దశలో 6 మండలాల్లో ఎన్నికలు: కలెక్టర్ రాహుల్ రాజ్
తొలి దశలో మెదక్ జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదినికి వివరించారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం చేశామని, 76 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనుట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు ఫోర్ టైర్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పత్ నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్
వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా పని చేయాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ కలెక్టర్ చాంబర్ నుంచి ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి విడతలో 6 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకోసం 1292 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1421 పీవోలు, 19 మంది ఏపీవోలు, 155 మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు వంద శాతం ఓటింగ్‌లో పాల్గ్గొనాలని కలెక్టర్ కోరారు.