మెదక్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): శాసనమండలి ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్ సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ శాసన మండలి స్థానానికి షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలిగించాలన్నారు. నోటిఫికేషన్ ఈనెల 3న విడుదల చేస్తామని, 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్రూటీని, ఫిబ్రవరి 13 లోగా ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి పరిషరించాలని సీఈవో అధికారులకు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఎన్నికల నియమావళికి సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో మెదక్ ఆర్టీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.