సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 30: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను సెప్టెంబర్ నెలాఖరులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులతో ఎస్సీ, ఎస్టీల కేసులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. పెండింగ్ ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన పోలీసు, రెవెన్యూ శాఖ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా పోలీసు సిబ్బంది పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను వసతి గృహాలను అధికారులు తరుచుగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందించేలా చర్య లు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి కమిషన్ చైర్మన్‌కు వివరించారు. భూ సమస్యలపై ఆర్డీవోలతో విచారణ చేయించి, వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామని తెలిపారు.
వసతి గృహాలను విధిగా తనిఖీలు చేస్తున్నామని, అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి జిల్లాలో పోలీస్‌శాఖ తరపున చేపట్టిన కార్యక్రమాలను ఎస్పీ రూపేశ్ కమిషన్ చైర్మన్‌కు వివరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, నీలాదేవి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అఖిలేష్‌రెడ్డి, డీవీఎంఎస్ సభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఆగస్టు 30: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరిశీలించారు. వంటశాలకు వెళ్లి డిన్నర్ కోసం వండిన ఆహారాన్ని తనిఖీ చేశారు. ఆహారం ఎలా ఉంటున్నదని విద్యార్థులను అడిగారు.
జిమ్‌ను సందర్శించి స్వయంగా వ్యాయామం చేశారు. విద్యాబోధన ఎలా ఉన్నదని, వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పత్రి లలితారాణి విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు బ్రహ్మకుమారీస్ సంస్థతో సైకియాట్రిస్ట్ బోధన ఒప్పందం చేసుకున్నారని ఆ ఒప్పందం రద్దు చేయాలని బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బంకి వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గురుకులాలను పరిశీలించి లోటుపాట్లు గుర్తించి రిపోర్టు తయారు చేయమన్నారన్నారు.
కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్నదని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదని గుర్తించి పీసీబీశాఖకు లెటర్ రాసి కాలుష్యాన్ని నివారించేలా చూస్తామన్నారు. ముళ్లపొదలు, కంపచెట్లు, మురుగు తొలిగించేలా ఎంపీడీవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రేనికుంట్ల ప్రవీణ్, శంకర్, నేనావత్ రాంబాబునాయక్ , డిప్యూటీ డైరెక్టర్ అఖిలేశ్‌రెడ్డి, సీఐ ప్రవీన్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.