ఝరాసంగం, జూలై 25 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల ంలోని బర్ధిపూర్, ఎల్గోయి, చీలపల్లి గ్రామ శివారులోని నిమ్జ్ ప్రాంతాన్ని శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. వెమ్ టెక్నాలజీ, హుందాయ్ పరిశ్రమలకు కేటాయించిన భూముల వివరాలను అడిగితెలుసుకున్నారు. ఇప్పటి వరకు సేకరించిన భూమి, సేకరించాల్సిన భూముల వివరాలు, దీనికి సంబంధించిన రోడ్ల గురించి నిమ్జ్ అధికారులను అడుగగా వారు నిమ్జ్ ప్రాజెక్ట్ భూపటం (మ్యాప్) ద్వారా కలెక్టర్‌కు వివరించారు.
ఈ ప్రాంతంలో సమస్యాత్మక భూములు ఉంటే వాటిని తక్షణమే గుర్తించాలని ఆమె సూచించారు. చీలపల్లి తండాలో మొత్తం జనాభా ఎంత ఉందని స్థానిక అధికారులను అడుగగా సుమారు 500 వరకు జనాభా ఉంటుందని కలెక్టర్‌కు వివరించారు. తండాలో 117, 121 సర్వే నెంబర్లలో ఉన్న భూమి విస్తీర్ణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఏమైనా అబాదీ, గ్రామ కంఠం భూములు ఉన్నాయా ..ఉంటే దానిపై అధికారులు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు.
బర్ధిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు హాజరు రిజిస్టర్‌తో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. బడిబాట ద్వారా చేరిన విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. బడి వయస్సు గల పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందరికీ అందాయా అని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మైరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో సరిపడా మరుగుదొడ్లు, ప్రహరీగోడ, అదనపు తరగతి గదుల విషయాన్ని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఆమె వెంట సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ జనరల్ మేనేజర్ రతన్ రాథోడ్, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి, తహసీల్దార్లు తిరుమలరావు, ప్రభు, ఆర్ఐ రామారావు, సర్వేయర్లు నర్సింహులు, లాల్‌సింగ్ ఉన్నారు.