దుబ్బాక, డిసెంబర్ 28 : కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ దేవాలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 30న ముకోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల వసతులపై ఆయన దేవాలయ కమిటీ సిబ్బంది, పోలీస్ తదితరశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుబ్బాక పై మమకారంతోనే బాలాజీ దేవాలయానికి కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ దేవుళ్ల పేర్లు పెట్టారన్నారు. జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనే దుబ్బాక బాలాజీ దేవాలయం ప్రసిద్ధిగాంచిందని, ముకోటి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రానున్నందున ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు, దేవాలయ కమిటీ సిబ్బందికి సూచించారు. దేవాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని సూచించారు.
వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కట్టుదిట్టంగా భద్రతా చర్యలు అమలు చేయాలని, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల పారింగ్, రాకపోకల నియంత్రణ విషయాల్లో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బాలాజీ దేవాలయానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిషరించారు. దేవాలయంలో నిర్వహించిన భగవద్గీత పారాయణంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. దేవాలయ, పోలీస్, మున్సిపల్ అధికారులు, దేవాలయ కమిటీ, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
రఘోత్తంపల్లిలో రైతులకు ఆత్మీయ పలకరింపు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యవసాయ పనులు చేస్తున్న రైతులను ఆత్మీయంగా పలకరించారు. వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు, పంటల పరిస్థితిపై చర్చించారు. వారి సమస్యలు తెలుసుకొని బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.