దుబ్బాక, మార్చి 18: ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లోని పలు అంశాలపై విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. స్వయంగా బోర్డుపై గణితంలోని పలు అంశాలను బోధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆమె అభినందించారు. పరీక్షల సమయంలో ఒత్తిడి, తడబాటుకు గురికాకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు.
ప్రతి విద్యార్థికి పదవ తరగతి తొలిమెట్టు అని సూచించారు. భోజనం సరిగా లేదంటూ అదనపు కలెక్టర్ ఎదుట విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న వసతి గృహంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, డార్మెటరీ లేకపోవడంతో తరగతి గదిలోనే నిద్రిస్తున్నామని తెలిపారు. డెస్క్‌లు, ఫర్నిచర్ లేక భోజనం, విద్య అంతా నేలపైనే కొనసాగుతోందని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన అదనపు కలెక్టర్.. కిచెన్‌షెడ్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం ముద్దగా ఉండడం, బీట్రూట్ కూర ఉడకక పోవడంపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతలేని బియ్యం బస్తాలను తిరిగి పంపించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మ తదితరులు ఉన్నారు.