రాయపోల్, ఏప్రిల్ 29: అపర భగీరథుడు సీఎం కేసీఆర్, సాగు,తాగునీరు అందించి ఇబ్బందులు తొలిగించిన ఘనత ఆయనకే దక్కిందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు చూస్తుంటే కడుపు నిండుతున్నదన్నారు. శనివారం కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద కామారెడ్డికి వెళ్లే 17వ ప్యాకేజీ కాల్వ పనులను జుక్కల్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, మదన్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.అనంతరం రాయపోల్ మండలం వీరనగర్ వద్ద ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. ఒకప్పుడు ఏడారిగా ఉన్న తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులు గుండాలుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు.
మహారాష్ట్ర రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలేక తెలంగాణకు వచ్చి విక్రయించినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్‌తో బీడు భూములు సస్యశ్యామలం చెందుతున్నాయన్నారు. మల్లన్నసాగర్ ద్వారా 12 నియోజక వర్గాల్లో పది లక్షల ఎకరాలకు ప్రత్యేకంగా, పరోక్షంగా సాగునీరు అందుతున్నదన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాత్ జీవన్ పాటిల్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సాగునీటి శాఖ ఈఎస్సీ మురళీధర్, సీఈ అజయ్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.