పటాన్చెరు, సెప్టెంబర్ 20: డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మకాలు, సరఫరా చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసిన 20 కేసులకు సంబంధించి ప్రభుత్వ నిషేధిత 583కిలోల గంజాయి, 1.777 కిలోల ఆల్ఫా జోలం, 980 గ్రాముల ఎండీఎంఏ చట్ట ప్రకా రం కోర్టు అనుమతితో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశామని ఎస్పీ తెలిపారు.
శనివారం పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని మెడికేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ దహనం చేసినట్లు తెలిపారు. కొందరు అక్రమార్జన కోసం ఆల్ఫాజోలం, గంజాయి సాగు, అమ్మకాలు చేశారన్నారు. యవతను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి లాగుతున్నారని తెలిపారు. జిల్లాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, పటాన్చెరు డీఎస్పీలు ప్రభాకర్, సత్యయ్యగౌడ్, వర్టికల్ డీఎస్పీ సురేందర్‌రెడ్డి, మెడికేర్ ఎన్విరాన్మెంట్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్లు వినాయకరెడ్డి, విజయకృష్ణ, పోలీసులు పాల్గొన్నారు.