రామచంద్రాపురం, ఏప్రిల్ 26: కల్తీ సామ్రాజ్యం రోజురోజుకు విస్తరిస్తున్నది. తాగే పాల నుంచి తినే ఆహారం వరకు అంతా కల్తీ చేస్తున్నారు. కల్తీ తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కల్తీ తయారీ కేంద్రాల పైన అధికారులు ఎన్ని దాడులు నిర్వహించినా తయారీ కేంద్రం స్థానం మారుతుంది కాని వ్యాపారం ఆగడం లేదు. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. తాగే పాల నుంచి తినే ఆహార పదార్థాల వరకు అంతా కల్తీమయం. ఎన్ని ఆరోగ్య చిట్కాలు పాటించినా మనం తినే ఆహార పదార్థాల కల్తీ అవుతుంటే ఏవిధంగా ఆరోగ్యంగా ఉంటామనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన తాతలు స్వచ్ఛమైన ఆహారం తీసుకొని తొంభై ఏండ్లు ఆరోగ్యవంతంగా బతికారు.
ఇప్పుడా పరిస్థితి లేదు. పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్, అల్లం, కారం, పసుపు, ధనియాలు, గరంమసాల పొడులతో పాటు బేకరీ ఐటమ్స్, ఐస్‌క్రీమ్స్, మాంసం, గుడ్లు ఇలా ఎన్నో ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కల్తీలకు పాల్పడుతూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న అక్రమార్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కఠిన శిక్షలు పడేలా చేస్తే కల్తీని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్వోటీ పోలీసులు కల్తీ పదార్థాల తయారీ కేంద్రాలపైన దాడులు చేసి సంబంధించిన కల్తీ పదార్థాలను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. కానీ, చట్టంలోని లొసుగులను వాడుకొని తిరిగివచ్చి మళ్లీ వేరేచోట కల్తీ వ్యాపా రం మొదలుపెడుతున్నారు. దీంతో కల్తీలకు అడ్డుకట్ట పడడం లేదు.

02
హైదరాబాద్ పరిధిలో ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో లభ్యమైన కల్తీ పదార్థాలను చూసి ప్రతి ఒక్కరూ విస్తుపోయారు.
హైదరాబాద్ పరిధిలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో లభ్యమైన కల్తీ ఆహార పదార్థాల వివరాలు ఇలా ఉన్నాయి..అల్లం, వెల్లుల్లి పేస్ట్ 18టన్నులు, ఛాయ్పత్తి 2టన్నులు, చికెన్, మటన్ 17టన్నులు, పెరుగు 2.5 టన్నులు, పన్నీర్ 4.5 టన్నులు, చిప్స్,చాక్లెట్స్ 100 కేజీలు, పచ్చళ్లు 9టన్నులు, నెయ్యి, నూనె, క్రీమ్ 4 టన్నులు, కోవా 5 టన్నులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తున్న నేపథ్యంలో మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో వంటకు సంబంధించిన అల్లం, వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, కారం, పసుపు, ధనియాలు, మిరియాలు ఇలా అన్ని ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ ఇన్స్ట్టెంట్గా మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడుకుంటున్నాము. దీనికి తోడు ఈమధ్య కాలంలో చాలా మంది వంట చేసుకోవడానికి బద్దకిస్తు బయటి ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. మార్కెట్లో కొత్త కొత్త పేర్లతో లభించే ఆహార పదార్థాలు మంచివో, కల్తీవో మనకు తెలియవు. వాటినే కొనుగోలు చేస్తు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం.
కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రాలపైన ఎస్వోటీ దాడులు నిర్వహిస్తున్నది. కల్తీ కేంద్రాలను అరికట్టేందుకు నిఘా పెంచాం.సమాచారం వచ్చిన వెంటనే చర్యలు చేపడుతున్నాం. కల్తీ కేంద్రాలపైన దాడులు నిర్వహించి కల్తీ ఆహార పదార్థాలు, వాటిని తయారు చేసేందుకు వాడే ముడి సరుకులను సీజ్ చేస్తున్నాం. ఇటీవల గచ్చిబౌలి, చందానగర్, పటాన్చెరు, అమీన్పూర్ ఏరియాలో కల్తీ అల్లం, వెల్లుల్లి, ఐస్‌క్రీమ్స్, వంట నూనె, స్వీట్స్, బేకరి ఐటమ్స్ తయారీ కేంద్రాలపైన దాడులు నిర్వహించి సీజ్ చేశాం. ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు నడుస్తున్నట్లు తెలిస్తే వెంటనే ప్రజలు ఎస్వోటీ ఇన్స్పెక్టర్ 9490617275 నంబర్‌కు సమాచారం అందించాలి.
– అంజిరెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్