
కోహీర్, జనవరి 1 :చనిపోయిన తర్వాత అందరూ సమానమే. ధనిక, పేద భేదాలేవీ ఇక్కడ ఉండవు. ఇదే విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు ఒక గ్రామంలోని 178 కుటుంబాలు. తమ వాళ్లలో ఎవరు స్వర్గస్తులైనా ఖర్చుల కోసం ఒక్కొక్కరూ రూ.50 సాయం చేయాలి. ఇలా వచ్చిన డబ్బుతోనే అన్ని ఖర్చులు చూసుకోవాలి. కుటుంబం నుంచి ఒక్కరైనా అంత్యక్రియలకు హాజరవ్వాలి. ఆ రోజు చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వరు. ఇలా పలు తీర్మానాలు చేసుకుని తమవారి అంతిమ వీడ్కోలును ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే, పలువురు దాతలు సాయం చేయడంతో అంతిమయాత్ర కోసం వాహనాన్ని కొనుగోలు చేశారు. రెండేండ్లుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మనియార్పల్లి గ్రామస్తులు. ఈ గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఆదర్శంగా ‘మనీ’యార్పల్లి
కూలీ అయినా.. కోటీశ్వరుడికైనా ప్రాణం దేహాన్ని వదిలిన తరువాత అంత్యక్రియలు నిర్వహించాల్సిందే. సాధారణంగా కాస్తో కూస్తో డబ్బులున్నవారు ఆడంబరంగా, పేదవాళ్లు కాస్త నిరాడంబరంగా తమ వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే, ఓ గ్రామం మాత్రం కొత్త ఆలోచనతో వారి ఆత్మీయులకు అంతిమ వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. చనిపోయిన తర్వాత అందరూ సమానమేనని చాటుతూ అవసరమైన సాయం చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ అంతిమ సంస్కారాలకు హాజరవుతున్నారు. జనవరి, 2020 నుంచి ఈ పద్ధతిని పాటిస్తున్నారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మనియార్పల్లి గ్రామస్తులు. ఇందుకోసం స్థానికంగా ఉన్న 178 కుటుంబాలు కలిసి కొన్ని తీర్మానాలు చేసుకున్నాయి. తమ కుటుంబాల్లో ఎవరు స్వర్గస్తులైనా ప్రతీ కుటుంబం నుంచి ఒక్కరైనా అంత్యక్రియలకు హాజరుకావాలని, ఖర్చుల కోసం ఒక్కొక్కరూ రూ.50 సాయం చేసి, ఆ డబ్బుతోనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి ఎవరు చనిపోయినా వారి ఇంటికివెళ్లి తమకు తోచిన సాయాన్ని అందజేస్తున్నారు. ప్రారంభంలో ఒక రూపాయి, తర్వాత రెండు రూపాయలు, ప్రస్తుతం యాభై రూపాయలు ఇస్తున్నారు. మృతదేహానికి దుస్తుల కొనుగోలు, సమాధి ఖర్చులు, కులవృత్తి వారికి కొంత వెచ్చిస్తారు. చనిపోయిన వారి ఇంట్లో ఆ రోజు వంటలు చేయడానికి కూడా అవే డబ్బులను ఉపయోగిస్తారు. చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వరు. బియ్యం, చింతపండు, ఉప్పు, కారం, తదితర సామగ్రిని కొనుగోలు చేసి వారి ఇంటికి సరఫరా చేస్తారు. ఇలాంటి మంచి పనిచేస్తూ మనియార్పల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది.
వాహనం కొనుగోలు..
ఎవరు చనిపోయినా గ్రామస్తులు అందించే ఆర్థిక సాయంతో అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది దాతలు ఇచ్చిన విరాళాలతో అంతిమయాత్ర కోసం వాహనాన్ని కొనుగోలు చేశారు. అంత్యక్రియలు నిర్వహించే స్థలం గ్రామానికి దగ్గర ఉంటే మాత్రం (కంపరం) పాడె కట్టి మృతదేహాన్ని తీసుకెళ్తారు. అంత్యక్రియలు జరిపే ప్రాంతం దూరంగా ఉంటే కచ్చితంగా వాహనాన్ని వినియోగిస్తున్నారు. అలాగే, వర్షం కురిసినప్పుడు కూడా తప్పనిసరిగా వాహనాన్ని ఉపయోగిస్తున్నారు.
అందరూ సమానమే…
మా గ్రామంలో ఎవరు చనిపోయినా బాధ్యతగా వారి ఇంటికి వెళ్తాం. కోటీశ్వరుడైనా కూడా గ్రామస్తులు ఇచ్చిన డబ్బులతోనే అంత్యక్రియలకు సంబంధించిన అన్ని పనులు చేస్తం. చనిపోయిన రోజున వారి ఇంట్లో వంటలు చేయడానికి కూడా బయట నుంచి సరుకులు తెచ్చి ఇస్తం. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కాబట్టి మేము డబ్బులు జమచేసి ఖర్చు పెడుతున్నాం.
చాలామంచి పనిచేశారు…
ఎవరు కూడా భూమి మీద ఎప్పటికీ ఉండిపోవడానికి రాలేదు. ఏదో ఒకరోజు తప్పకుండా పోవాల్సిందే. మా గ్రామంలో ఎవరు చనిపోయినా వారి ఇంటికి తప్పకుండా పోతం. ఇంతకుముందు ఒక రూపాయి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు యాభై రూపాయలు జమచేస్తున్నం. ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా సంతోషంగా ఉంటది.