మెదక్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ గిరిజన సంక్షేమాధికారి నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో కేరళం రాష్ట్రంలోని కొచ్చిలో నైపుణ్య శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించారని, మెదక్ జిల్లా నుంచి అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులు తమ దరఖాస్తులు పూర్తి చేసి ఈనెల 10లోగా సమర్పించాలన్నారు.
మేలో శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలల పాటు ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ (ఆయిల్, గ్యాస్), ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ వెల్డర్ (ఆయిల్, గ్యాస్), ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో శిక్షణ ఇస్తారన్నారు. టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్న, ఐటీఐ చదివి 25 ఏండ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉచిత వసతి, భోజనం, లెర్నింగ్ మెటీరియల్, యూనిఫామ్, సేఫ్టీ షూస్ అందజేస్తారని తెలిపారు.