మెదక్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ప్రజాపాలన చివరి రోజులో భాగంగా మెదక్ పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్‌లో దరఖాస్తులు స్వీకరించి, సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే మహిళల కోసం ఉచిత బస్ పథకాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఆరు గ్యారెంటీలను త్వరలోనే ఆచరణలోకి తీసుకువస్తామని, రూ. 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు పేదలకు అందజేస్తామన్నారు. విద్యా, వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం…; ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మంత్రి సహకారంతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, ప్రజాపాలన స్పెషల్ అధికారి జయరాజ్, డీపీఆర్వో ఏడుకొండలు, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జానకీ శ్రీరాం, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్లు ఆర్కె శ్రీను, లక్ష్మీనారాయణగౌడ్, ఆవారి శేఖర్, దాయర లింగం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జోనల్ మార్పుపై కమిటీ వేద్దాం..
మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలన్న డిమాండ్‌ను రాజకీయాలకతీతంగా ఓ కమిటీ వేసి ప్రభుత్వానికి దరఖాస్తు అందజేసి పరిష్కరించుకుందామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం నర్సాపూర్ మండలం రుస్తుంపేట, తూప్రాన్ మున్సిపాలిటీ 16వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. రుస్తుంపేటలో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్నాలెడ్జ్మెంట్ పత్రాలను దరఖాస్తులదారులకు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని, నాణ్యమైన విద్యా, వైద్యం అందించాలన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానలో బ్లడ్‌బ్యాంక్, డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.
ప్రజాపాలనపై అవగాహన కల్పించాం..; మెదక్ కలెక్టర్ రాజర్షి షా
ప్రజాపాలన దరఖాస్తులపై గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామపంచాయతీలు, 78 వార్డుల్లో దరఖాస్తులు తీసుకున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, గ్రామసర్పంచ్ విజయభాస్కర్‌రాజు, ఎంపీపీ జ్యోతీ సురేశ్‌నాయక్, ఎంపీటీసీ లక్ష్మీ అశోక్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో మార్టిన్ లూథర్, జడ్పీటీసీ బాబ్యానాయక్, నాయకులు ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్, చంద్రశేఖర్, నయీమొద్దీన్, సుహాసిని రెడ్డి, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.
మెదక్‌ను చార్మినార్ జోన్లో కలపాలి ; ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించారు. ఆరు గ్యారెంటీలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాలని సూచించారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందని, వాటికి టెండర్లను ఆహ్వానించి పనులు పూర్తిచేసేందుకు సహకరించాలన్నారు. నర్సాపూర్ ఏరియా దవాఖానలో సిబ్బందిని పెంచి, డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.