శివ్వంపేట, జనవరి 21 : మండలంలోని సికింద్లాపూర్ గ్రామశివారులో దట్టమైన అడవులు, కొండల మధ్య వెలిసి న లక్ష్మీనృసింహస్వామి భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ కొంగుబంగారంగా మారారు. సుమారు 700 ఏండ్ల క్రితం సికింద్లాపూర్‌లోని దట్టమైన అడవిలో సప్తరుషులు తపస్సు చేస్తుండగా కొండపైన స్వామివారి గాండ్రింపులు వినిపించాయి. రుషులు వెళ్లి చూడగా సర్పం (వాసూకి) నీడలో ఉగ్రరూపంలో నర్సింహస్వామి దర్శనమిచ్చాడు. గుర్తించి రుషులు స్వామిని శాంతింపచేశారు. భక్తుల కోరిక మేరకు స్వామి శిలగా మారి రెండు బండరాళ్ల మధ్యన పడుకొని నేటికీ లక్ష్మీనృసింహస్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ఆలయం సమీపంలోని కోనేరు పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేస్తే అన్ని రకాల చర్మవ్యాధులను నయమవుతాయ ని భక్తుల నమ్మకం. కోనేరు పైన ఉన్న మర్పటి చెట్టు ఔషధగుణం కలిగిఉందని, దాని ఆకులు కోనేరులో పడి చర్మవ్యాధులు నయం చేస్తుందని భక్తుల నమ్మకం. పూర్వం కోనేరు వందల ఎకరాలకు సాగునీరు అందించేదని పెద్దలు చెబుతా రు. 1995లో కొండ సమీపంలో ఆలయం నిర్మించి లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తు న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పాలరాతితో చేసిన లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ప్రతి ఏటా ధనుర్మాసం నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు ప్రతి ఆదివారం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. మొక్కు లు తీరితే వెండితో చేసిన ఆభరణాలను హుండీలో వేస్తారు. సికింద్రాబాద్ నుంచి రైలు, బస్సు ప్రయాణం ద్వారా మనోహరాబాద్ చేరుకొని అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోవచ్చు.
భక్తుల సౌకర్యార్ధం ఆలయంలో 6 కాటేజీలు నిర్మించామని ఆలయ ప్రధాన పూజారి ధనుంజయశర్మ తెలిపారు. ఆలయాన్ని ఈవో శశిధర్గుప్తాతో అభివృద్ధి చేస్తున్నారు.
లక్ష్మీనృసింహస్వామి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అధికారికంగా స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.