రాయపోల్ : తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ జాబితాను జాగ్రత్తగా సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రైతు వేదికలో దౌల్తాబాద్, రాయపోల్ బీఎల్వోలకు ఓటరు నమోదుపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. మృతుల తొలగింపు, సవరణ, కొత్త ఓటర్లు ఎలా నమోదు చేయాలి తదితర అంశాలను వినియోగించాల్సిన ఫారాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం గోవిందాపూర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, దౌల్తాబాద్ పీహెచ్సీ, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గురుకుల పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదుల్లో విద్యార్థులను పాఠశాలు ఎలా బోధిస్తున్నారంటూ ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం ఎలా పడుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. దౌల్తాబాద్ పీహెచ్సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీజన్లో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని సైతం సందర్శించారు. మండల స్పెషల్ అధికారి లింగస్వామి, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, తహశీల్దార్ చంద్రశేఖర రావు, మండల విద్యాధికారి కనకరాజు, ప్రిన్సిపాల్ స్వప్న, ఎంపీవో గఫూర్ ఖాద్రి ఉన్నారు.