Tiger : సిద్ధిపేట జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. మొన్నటివరకూ మిరుదొడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగిన పులి ప్రస్తుతం జగదేవ్పూర్ (Jagdevpur) మండలంలో సంచరిస్తోంది. గంధమల్ల(యాదాద్రి), ఇంద్రనగరం ప్రాంతంలో పులి ఉందని ప్రజల్ని హెచ్చరించారు పోలీసులు. ఆదివారం పీర్లపల్లి అడవిలో పులి తిరగడం చూసి కొందరు భయాందోళనలకు గురయ్యారు. కొండపూర్ నుంచి బండి మీద వస్తుండగా.. ధర్మారం దాటిన తర్వాత రహదారికి కొంత దూరంలో పులిని చూసినట్టు ఒక వ్యక్తి వీడియోలో వివరించాడు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని అతడు సూచించాడు.
మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన పులి.. యాదాద్రి, సిద్ధిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తోంది. గత రెండు వారాలుగా జగదేవ్పూర్ మండంలోనే పులి తిష్ట వేసినట్టు సమాచారం. తీగుల్, బీజీ వెంటకాపూర్లో తిరిగిన ఈ వ్యాఘ్రం ప్రస్తుతం గంధమల్ల, ఇంద్రనగరం, పీర్లపల్లి, ధర్మారం గ్రామ అడవుల్లోకి వచ్చింది. దాంతో.. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగదేవ్పూర్ పోలీసులు సూచించారు. పులి ఆచూకీ కనిపిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ నేపథ్యంలో జగదేవ్పూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలను వాహనం మీద తీసుకొచ్చి, స్కూల్ ముగియగానే తిరిగి వారిని తమ వెంట తీసుకెళ్లాలని ఆయన కోరారు.