సంగారెడ్డి, ఏప్రిల్ 24: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ చర్యలు తీసుకుంటున్నది. బస్‌స్టాపుల్లో నీడ కోసం కానోపీలు ఏర్పాటు చేసి వేసవిలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 బస్‌స్టాప్‌ల్లో నీడకోసం కానోపీలు ఏర్పాటు చేసి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా టెంట్లు, రేకులు, తడకల షెడ్లు, తాత్కాలిక గ్రీన్ నెట్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది బస్‌డిపోల్లో నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న విషయం తెలిసిందే. అందులో ఏడు డిపోల పరిధిలో 13 కానోపీలు వేసవి కాలంలో బస్స్టేషన్లు లేనిచోట నీడలు ఇచ్చే షెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 చోట్ల తాత్కాలికంగా నీడలు అందించే షెడ్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ యాజమాన్యం సేవలందిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో 361 ఆర్టీసీ బస్సులు, 272 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ అధికారులు చేపట్టిన కానోపీ సేవలు అద్భుతమని ప్రయాణికులు కొనియాడుతున్నారు.
ప్రయాణికుల సేవలకే కానోపీలు
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సుల్లో ప్రయాణించే వారికి బస్‌స్టాపుల్లో నీడ కోసం కానోపీలు ఏర్పాటు చేశాం. మెదక్ రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో అధికంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో కానోపీల కింద ప్రయాణికులు ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి జిల్లాలోని 13 ప్రాంతాల్లో కానోపీలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాం. కానోపీలు అందుబాటులో లేని ప్రాంతాల్లో తడక, రేకుల షెడ్లు, టెంట్లు సిద్ధం చేశాం. బస్సు వచ్చే వరకు నిలబడే ప్రయాణికులకు ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు కానోపీలు ఎంతో ఉపయోగపడతాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో కానోపీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– సుదర్శన్, మెదక్ ఆర్ఎం
13 చోట్ల కానోపీల ఏర్పాటు..
ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు 13 చోట్ల నీడ కోసం కానోపీలు ఏర్పాటు చేశారు. బస్స్టేషన్లు లేని రద్దీ ప్రాంతాల్లో వేసవిలో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈవిషయాన్ని గుర్తించి కానోపీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నీడ కోసం ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టెంట్లు, తడకలు, రేకుల షెడ్లు, గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశారు.మెదక్ డిపో పరిధిలో పోతంశెట్టిపల్లి, బోడ్మట్పల్లిలో ఒక్కొక్కటి, సంగారెడ్డి డిపో పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా, లింగంపల్లి, ఇస్నాపూర్ ప్రాంతాల్లో ఒక్కొటి, జహీరాబాద్ డిపో పరిధిలో బుధేరా, బీదర్ వెళ్లే మార్గం(పోతిరెడ్డిపల్లి)లో రెండు, నారాయణఖేడ్ డిపో పరిధిలో పట్టణంలోని రాజీవ్‌చౌక్‌లో ఒకటి, బసవేశ్వరచౌక్ వద్ద మరొకటి, సిద్దిపేట డిపో పరిధిలో పట్టణంలోని పెట్రోల్ బంక్-ఓబీఎస్, దుబ్బాక చౌరస్తాలో ఒక్కొక్కటి, హుస్నాబాద్ డిపో పరిధిలోని సుందరగిరిలో ఒకటి, గజ్వేల్ డిపో పరిధిలో ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఒకటి చొప్పున కానోపీలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.