సిద్దిపేట, ఏప్రిల్ 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం.. రైతులకు మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. కేంద్రం తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యా న్ని కొనుగోలు చేయమని తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చిత్రపటాలకు మంగళవారం రాత్రి రైతులు క్షీరాభిషేకం చేశారు. గ్రామాల్లో రైతుల సంబురాలు అంబరాన్నంటాయి. ధాన్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించగానే రైతులు సంబురపడిపోయారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. క్వింటాలుకు రూ.1,960 చెల్లిస్తారు. మూడు నాలుగు రోజుల్లో గ్రామాల్లో ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణను ప్రారంభిస్తారు.
ఏ ఒక్క రైతు కూడా తక్కు వ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనతో గత యాసంగిలో సాగు చేసిన దానికన్నా ఈసారి వరి సాగు తగ్గింది. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 4,69,057 ఎకరాల్లో సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో 2,66,000 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఇందుకు దిగుబడి 6,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది అని అంచనా వేశారు. మెదక్ జిల్లాలో 1,67,795 ఎకరాల్లో వరిని సాగు చేయగా, 3,47,117 మెట్రిక్ టన్నుల ధాన్యం, సంగారెడ్డి జిల్లాలో 35,262 ఎకరాల్లో వరిని సాగు చేయగా.. 8,46,288 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుందని అంచనా వేశారు. ధాన్యం సేకరణపై ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలి..? ఎలా కొనుగోలు చేయా లి..? ట్రాన్స్‌పోర్టు.. లోడింగి అన్ లోడింగ్.. గోదాముల సామర్ధ్యం.. గోనే సంచులు, ప్యాడి క్లీనర్, వేయింగ్ మిషన్ తదితర వాటిపై జిల్లా స్థాయిలో నేడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి విదివిధానాలు ఖరారు చేయనున్నారు.
మొండికేసిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుంది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో తన మొం డి వైఖరిని వీడలేదు. బీజేపీ నాయకులు ధాన్యం సేకరణపై ఇష్టారీతిగా మాట్లాడుతారు. చేతగాని దద్దమ్మలుగా ఉండి పోయారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారు. బీజేపీ నాయకులకు రైతులపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇకనైనా తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని రైతులు బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నారు. గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని రైతులు, రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
రైతుల ముంగిటా కేంద్రాల ఏర్పాటు
ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఆయా ఏరియా వారీగా ఎంత విస్తీర్ణం సాగు చేశారు. ఎక్కడెక్కడ ధాన్యం ఎక్కువగా వస్తున్నది. అన్నీ అంచనా వేసి అందుకు అనుగుణంగా గ్రామాల్లో వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ధాన్యం సేకరణలో ఏ విధంగా సేకరించారు.. గతంలో ఉన్న సమస్యలు, ఎండలు ముదరడంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఇవన్నీ కులంకషంగా చర్చించి రెండు మూడు రోజల్లో జిల్లా అధికార యంత్రాంగాన్ని గ్రామాలకు పంపించి రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ ప్రారంభిస్తారు. ప్రతి కేంద్రానికి ఒక అధికారిని ఇన్ చార్జిగా నియమించి రైతుల ధాన్యం సేకరిస్తారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో ఏ ఒక్క రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు ఇలా అన్నింటికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ధాన్యం కూడా తామే కొనుగోలు చేస్తుందని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.
కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం
బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులను రోడ్డున పడేసింది. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్న మోదీ సర్కారుకు నూకలు చెల్లే సమ యం ఆసన్నమైంది. తెలంగాణ రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించడం హర్షణీయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కమిట్మెంట్తో ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతుందని, మరోసారి రుజువు చేసింది. యాసంగి ధాన్యం కొంటామని ప్రకటించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ రైతులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనిపిస్తామని తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ ఎం పీలు, ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారు. రైతుల కోసం మేము ఉద్యమం చేస్తే, ఆ బీజేపీ నాయకులు కనీసం ఒక్కసారి కూడా మోదీ సర్కారును ఒప్పించలేకపోయారు. రైతులను మోసగించిన బీజేపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. బీజేపీ వైఖరిపై బండి సంజయ్ సమాధానమివ్వాలి.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ
రైతుల పక్షాన తెలంగాణ సర్కార్..
కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసినా రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని సీఎం కేసీఆర్ మరోసారి రుజువు చేశాడు. యాసంగిలో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని శుభవార్త చెప్పాడు. రైతుల బాగోగులు తెలిసిన వ్యక్తి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు ఒకే విధంగా చూడకుండా పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాలకు వంత పాడుతుంది. కేంద్రం తన వైఖరి మార్చుకోవాలి.
– బట్టి జగపతి, మార్కెట్ కమిటీ చైర్మన్, మెదక్
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. యాసంగి వడ్లను కొనకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొంటుందని శుభవార్త చెప్పాడు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిసిన వ్యక్తి మనకు సీఎంగా ఉండడం మన అదృష్టం. తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది.
– తెల్లాపూర్ పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి, ఆర్సీపురం, సంగారెడ్డి జిల్లా