
కొవిడ్ వ్యాప్తి, పాజిటివ్ రేట్ తగ్గింది
ప్రజల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది
బాధితుల యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత సర్వే బృందం సభ్యులు, అధికారులదే
45 రోజుల పాటు సర్వే కొనసాగించాలి
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
గజ్వేల్ అర్బన్, మే 15 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇంటింటా జ్వర, ఆరోగ్య సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. శనివారం ములుగులోని కలెక్టరేట్ నుంచి జర్వ సర్వే అమలుపై ఆర్డీవోలు, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్వర సర్వేపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 8,552 మంది కరోనా వైరస్ లక్షణాలైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 8,316 మందికి మెడికల్ హెల్త్ కిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారందరికీ మెడికల్ హెల్త్ కిట్లు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వేతో క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నా రు. కరోనా పాజిటివ్ రేట్ తగ్గడంతోపాటు మరణాల రేటు తగ్గిందన్నారు. వచ్చే 45 రోజుల పాటు సర్వేను మరింత క్రియాశీలకంగా కొనసాగించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సర్వే తర్వాత కరోనా పాజిటివ్ రేటు 20 శాతానికి తగ్గిందన్నారు. జిల్లాలో 45 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే కరోనా పూర్తిగా తగ్గుతుందని కలెక్టర్ వివరించారు.
కొవిడ్ బాధితుల సంరక్షణ
బాధ్యత అధికారులదే..
సర్వేలో భాగంగా గుర్తించిన కొవిడ్ బాధితులు పూర్తిగా స్వస్తత పొందేవరకు వారి యోగక్షేమాలను అధికారులు, సర్వే బృందం సభ్యులే చూడాలని కలెక్టర్ ఆదేశించారు. బాధితుల పరిస్థితిని ఉదయం, సాయంత్రం అడిగి తెలుసుకోవాలన్నారు. అత్యవసరమైతే వెంటనే దవాఖానకు తరలించి వైద్యసేవలు అందించాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదన పు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, డీఆర్డీవో గోపాలరావు, వైద్యాధికారులు కాశీనాథ్, డాక్టర్ మహేశ్ ఉన్నారు.