రాయపోల్, ఏప్రిల్ 07 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మహారాజ్ పురస్కారం స్వీకరించారు. రాష్ట్రస్థాయి అవార్డు రావడం సంతోషకరమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పునస్కరించుకొని హైదరాబాదులోని రవీంద్రభారతిలో మంగళవారం రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అందిస్తున్న మెరుగైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. సిద్దిపేట జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం రావడం ఎంతో గర్వకారణమని జిల్లా వైద్యాధికారి తెలిపారు. డాక్టర్ మహారాజ్‌ను జిల్లా వైద్యాధికారి ధనరాజ్ అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మహారాజ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు కేవలం తన ఒక్కడి కృషి వల్ల సాధ్యం కాలేదని, ఆస్పత్రిలో పనిచేసే నర్సింగ్ అధికారులు, ఏఎన్ఎంలు తదితర సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఈ పురస్కారం వచ్చిందని వెల్లడించారు. తమ ప్రాథమిక కేంద్రంలోని ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆయన రాష్ట్రస్థాయి అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్, గజ్వేల్ డిప్యూటీ వైద్యాధికారి ఎం. శ్రీనివాస్, డాక్టర్ అశ్లేష, లింగారెడ్డిపల్లి సబ్ సెంటర్ MLHP ప్రియాంక, స్థానిక ఏఎన్ఎమ్ ప్రేమ, తదితరులు పాల్గొన్నారు.